సూర్యాపేట, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం పార్బాయిల్డ్ రైస్ మిల్లులకు కేటాయిస్తే సుమారు రూ.217 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. ఇందుకు సంబంధించి రెండు మిల్లులపై పౌరసరఫరాల శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. గతంలో వందల కోట్ల రూపాయల ధాన్యం అమ్ముకున్న జిల్లాలోని పలు మిల్లులపై కేసులు నమోదు చేయగా.. తాజాగా గడ్డిపల్లిలోని సంతోషిమాత, దిర్శించర్ల వద్ద ఉన్న తిరుమల పార్బాయిల్డ్ రైస్ మిల్లులపై కేసులు నమోదయ్యాయి.
సంతోషిమాత మిల్లులో 33,930 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండాల్సి ఉండగా.. 231 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ఉన్నది. తిరుమల పార్బాయిల్డ్ మిల్లులో 33,250 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండాల్సి ఉండగా 142 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు మిల్లులకు సంబంధించిన యజమానులు వెంకటేశ్వర్లు, రాజేశ్ తండ్రీకొడుకులు కావడం గమనార్హం. వీరిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ ప్రసాద్ తెలిపారు.
వందల కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం మాయం చేసిన జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్యతోపాటు కోదాడకు చెందిన నీలా సత్యనారాయణపై కేసులు నమోదు చేసిన విషయం సంచలనం కాగా.. ఇప్పటి వరకు జిల్లాలో వందల కోట్ల రూపాయల ధాన్యం దిగమింగిన తిరుమలగిరిలోని నాలుగు మిల్లులపై కేసులు నమోదయ్యాయి. గడ్డిపల్లికి చెందిన కోదాడలో ఒకటి, గడ్డిపల్లిలో ఒకటి మొత్తం ఆరు కేసులు నమోదు కాగా.. తాజాగా గడ్డిపల్లి, దిర్శించర్లలో మరో రెండు మిల్లులతో కలిపి మొత్తం 8మిల్లులపై కేసులు నమోదు కావడం గమనార్హం.