సూర్యాపేట, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థులు లెక్కలు చూసుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులు మాత్రం చేసిన ఖర్చు తెలుసుకొని గుండెలు బాదుకుంటున్నారు. ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులుగా బరిలో నిలిచిన వారు ఎలాగైనా గెలవాలని లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కలను చూసుకొని వామ్మో… ఇన్ని లక్షలు ఖర్చు చేశామా.. అంటూ అటు గెలిచిన వారికి సుఖం లేకుండా పోగా ఓటమి పాలైనవారు లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందని తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల సమయంలో భూములు, ప్లాట్లు, ఇళ్లు, నగలు ఇలా ఏది పడితే అది కుదవపెట్టడంతో పాటు ఎక్కడ దొరికితే అక్కడ లక్షలాది రూపాయలు వడ్డీలకు తెచ్చి ఓటర్లకు పంచడం… మద్యం పంపిణీకి ఖర్చు చేశారు. తీరా ఎన్నికలు, కౌంటింగ్ పూర్తయిన అనంతరం లెక్కలు చూసుకొని అయిన ఖర్చుతో కళ్లు బైర్లుకమ్ముకుంటున్నాయని పేర్లు చెప్పడానికి నిరాకరిస్తూ పలువురు అభ్యర్థులు వాపోతున్నారు.
పంచాయతీ ఎన్నికలు ఒక విడత పూర్తి కాగానే మరో విడతలో అన్ని మండలాల నాయకులు, అభ్యర్థులు ప్రచారం చేశారు. ఈ నెల 11, 14, 17న ఎన్నికలు జరిగాయి. ఏరోజుకారోజు ఎన్నికలు, కౌంటింగ్ పూర్తి కావడంతో వెంటనే ఫలితాలు వచ్చేశాయి. కాస్త విశ్రాంతి అనంతరం 18, 19వ తేదీల్లో తమకు పోలైన ఓట్లు, చేసిన ఖర్చు తదితర అంశాలపై కుటుంబ సభ్యులతో కలిసి లెక్కలు చేసుకుంటున్నారు. గెలుస్తామనే ధీమాతో ఎక్కడ దొరికితే అక్కడ డబ్బులు తేగా.. తీరా లెక్క చేస్తేగాని తెలిసింది దిమ్మెతిరిగేలా లక్షలాదిగా ఖర్చు చేశామని వాపోతున్నారు. మెజార్టీ గ్రామాల్లో ప్రధాన పార్టీలు బలపర్చిన అభ్యర్థులతో పాటు తమకు బలం ఉంది… గెలుస్తామనే ధీమాతో రెబల్‌గా రంగంలోకి దిగి విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఇలా ఒక్కో గ్రామంలో ముగ్గురి నుంచి ఐదుగురు సర్పంచ్ అభ్యర్థులు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు చేశారు.
మేజర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో ఒక్కో అభ్యర్థి రూ.60 నుంచి రూ.70 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఎన్నికల్లో లెక్క చూసుకోకుండా ఖర్చు పెట్టుకుంటూ పోయాను… తీరా లెక్కలు చూస్తే దిమ్మెతిరిగేలా దాదాపు రూ.38 లక్షలకు లెక్క వచ్చిందని సూర్యాపేటకు అతి సమీపంలోని ఓ సర్పంచ్ అభ్యర్థి తన పేరు చెప్పడానికి నిరాకరిస్తూ వాపోయారు. ఇంత ఖర్చు చేస్తుంటే ఎంత వద్దని చెప్పినా డబ్బులు ఖర్చు చేశావంటూ ఆ అభ్యర్థి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సర్పంచ్ అభ్యర్థులు ఒక్కొక్కరు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి లెక్కలు చూసుకోగా గెలిచిన వారికి ఇంత ఖర్చు చేశామా? అని గుండెలు బాదుకుంటుండగా ఓటమి పాలైనవారు అంత ఖర్చు చేసినా ఓడిపోతిమంటూ.. ఓటర్లకు శాపనార్థాలు పెట్టడం గ్రామాల్లో వినిపిస్తోంది.