మునుగోడు, మార్చి 13 : కొవిడ్ సమయంలో మునుగోడు మండలంలోని కల్వలపల్లికి నిలిచిన బస్సు రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. గురువారం మండలంలోని కల్వలపల్లి గ్రామంలో పోరుబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఆయన పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ డిపో నుండి దోమలపల్లి, కల్వలపల్లి, పులిపలుపుల గ్రామం నుండి మునుగోడుకు వెళ్లే బస్సు రవాణాను నిలిపివేయడంతో కల్వలపల్లి నుండి వివిధ గ్రామాలకు వెళ్లే ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటలు తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి బస్సు సౌకర్యాన్ని తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
అలాగే కల్వలపల్లి గ్రామం నుండి అప్పాజీపేట, గూడపూర్ నుండి కల్వలపల్లి గ్రామం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. గ్రామంలో అర్హులకు రేషన్ కార్డు, పింఛన్, ఇందిరమ్మ ఇండ్లు అందించాలన్నారు. లేనిపక్షంలో ప్రజా సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్, వంటేపాక రమేశ్, లక్ష్మయ్య, మల్లేశ్, సైదులు, ఎల్లయ్య, రాములు, అంజయ్య, లింగస్వామి పాల్గొన్నారు.