నల్లగొండ, నవంబర్ 17 : వరి కొయ్యలు కాల్చడంతోపాటు ఇటీవల పటాకులు కాల్పులు, ఫ్యాక్టరీల్లో వెలువడే రసాయనాల వ్యర్థాలు, వాహన కాలుష్యం.. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం గాలి కాలుష్యం పెరిగింది. దీంతో అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరిగి గాలిలో నాణ్యత పడిపోయింది. దాంతో అనేక రకాల రోగాల బారిన పడుతున్నారు. ఇదే పరిస్థితి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నెలకొనే ప్రమాదం ఉన్నదా అంటే ఇప్పటికిప్పుడు కాకపోయినా వచ్చే రెండు మూడేండ్లలో తప్పదని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జిల్లాలో గడిచిన రెండు మూడేండ్లుగా రైతులు వరి సాగు చేసిన అనంతరం ఆ వరి కొయ్యలను భూమిలోనే నిర్మూలించకుండా కాల్చడం మూలంగా గాలిలో కాలుష్యం పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే ఫార్మా కంపెనీలు, సిమెంట్ కంపెనీల వ్యర్థాలు జిల్లాను వణికిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ రానున్న రోజుల్లో మరో ఢిల్లీలా మారే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. వరి కొయ్యలు భూమిలోనే నిర్మూలించకుండా కాల్చితే వచ్చే సాగుకు నష్టమే తప్ప లాభం లేదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
కాలానుగుణంగా వాహనాలు, ఫ్యాక్టరీలతోనే గాలి కాలుష్యం పెరుగుతుందనే ఆలోచన ఇప్పటి వరకు ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ ఇటీవల వ్యవసాయంలో వరి కొయ్యలు కాల్చడం వల్ల కూడా దీనికి తోడవుతుందని చెప్పవచ్చు. వరి కొయ్యలు కాల్చడం వల్ల వచ్చే సీజన్లో పంట పెరుగుదలకు అవసరమయ్యే పోషకాలు వాతావరణంలో కలిసిపోతాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. అదే విధంగా నేలలో సేంద్రియ కర్భన శాతంతోపాటు నేల సారం కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ వేడికి నేలలో ఉండే పంట ఉపయోగకర జీవులు కూడా చనిపోతాయి. నేలలో తేమ శాతం తగ్గి గట్టిపడి నేల కోతకు కూడా గురయ్యే అవకాశం ఉన్నది.
వరి కొయ్యలు కాల్చకుండా భూమిలోనే మురుగ పెడితే పంటకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గతంలో వరి కోసిన తర్వాత ఎలగడ దున్ని నీళ్లు పెట్టాక ఆ వరి కొయ్యలు చనిపోగానే ఆ భూమిని మరోసారి దున్నితే వరికొయ్యలు మొత్తం చనిపోయేవి. దాంతో ఆ పొలంలో పోషకాలతోపాటు కర్భన శాతం పెరుగుతుంది. అంతేకాక ఆ వరి కొయ్యలు కుళ్లిపోయేందుకు ఎకరంలో 150కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్ లేదా వేస్ట్ డీ కంపోజర్ చల్లడంతో మురిగి నేల సారవంతం అవుతుంది.
జిల్లాలో ఇప్పటికే పలు రకాలుగా కాలుష్య ప్రభావం ఆవహించి ఉన్నప్పటికీ తాజాగా రైతులు అవగాహన లేమితో వరి కొయ్యలు కాల్చడం వల్ల కొత్త ప్రమాదం తెచ్చిన వారవుతారని వాతావరణ వేత్తలు అంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక రకాలైన ఫార్మా కంపెనీలతో పాటు సిమెంట్ కంపెనీల వల్ల వాయు, నీటి కాలుష్యం అవుతున్నది. ప్రధానంగా ఫార్మా ప్రభావం యాదాద్రి జిల్లాలో ఉండగా సిమెంట్ కంపెనీల ప్రభావం సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో ఉన్నది. ఇదిలా ఉండగా ఈ సీజన్లో ఉమ్మడి జిల్లాలో 12.50లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా మొత్తం యంత్రాలతోనే కోసిన తర్వాత వాటి వరి కొయ్యలు పెద్దగా ఉండటంతో మొత్తం కాల్చివేస్తున్నారు. దాంతో వాయు కాలుష్యం పెరుగుతుండడంతో ప్రమాదం పొంచి ఉన్నట్లు అర్థమైతుంది.
వరికొయ్యలు కాల్చడం కంటే వాటిని భూమిలోనే మురగబెడితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. భూమిలో మురుగ పెట్టటానికి ఎకరానికి 1.50 కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్ వాడితే సరిపోతుంది. అంతేకాకుండా వేస్ట్ డీ కంపోజర్ ద్వారా కూడా మురిగిపోతుంది. అలా కాకుండా అవగాహన లేమితో కాల్చితే వచ్చే సీజన్లో పోషకాల లోపం ఏర్పడి పంట దిగుబడి తగ్గడంతోపాటు భావితరానికి నష్టం చేకూర్చిన వారవుతారు. దీనికి తోడు వాయు కాలుష్యం పెరిగి అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది.
-పాల్వాయి శ్రవణ్ కుమార్, డీఏఓ, నల్లగొండ