సూర్యాపేట అర్బన్ నవంబర్ 22 : ఇప్పటికే ఆదాయం తగ్గిందని పేద,మధ్య తరగతి ప్రజలపై అనేక రకాల భారం మోపి డబ్బు గుంజుతున్న ప్రభుత్వం దృష్టి ప్రస్తుతం విద్యార్థులపై మళ్లింది. అందులో భాగంగానే ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులపై నిరుటి కంటే అదనంగా రూ.110 వసూలు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన ఫీజును ఇప్పటికే విద్యార్థులనుంచి వసూలు చేస్తున్నారు. ఈ సారి ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్రభుత్వం నిర్ణయించిన తేదీల ప్రకారం రూ.100 అపరాధ రుసుముతో ఫీజు గడువును ఈ నెల 24 వరకు అవకాశం కల్పించింది.
అంతేకాకుండా సకాలంలో చెల్లించని విద్యార్థులు డిసెంబర్ 1 వరకు రూ.500, డిసెంబర్ 8 వరకు రూ.వెయ్యి అపరాధ రుసుముతో చెల్లించవచ్చని ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో జిల్లాలో చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని సుమారు 15వేల మంది విద్యార్థులపై అదనపు భారం పడనున్నది. కేవలం జిల్లాలో చదువుతున్న పేద ,మధ్య తరగతి విద్యార్థులనుంచి పరీక్ష ఫీజు పేరుతో సుమారు రూ.16 నుంచి రూ.17 లక్షలు వసూలు చేస్తున్నారు.
కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య తగ్గింపు
ఇప్పటికే జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య తగ్గుతుండటం విచారకరం. దానికి తోడు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంటు చెల్లించేందుకు అనువైన మార్గాల అన్వేషణలో భాగంగా ఇంటర్ విద్యార్థులపై భారం మోపడంతో రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలు మరింత తగ్గే అవకాశం ఉందని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ల్యాబ్ అవసరం లేని ఇంగ్లీష్‌కు ప్రాక్టికల్ ఫీజు పేరుతో విద్యార్థుల నుంచి రూ.100 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ అదనపు వడ్డింపుతో పాటు గతంలో కంటే ఈ సారి మరో రూ.10 విద్యార్థులపై పెంచి రూ.110 అదనంగా వసూలు చేస్తున్నారు. ఒకేషనల్ విద్యార్థుల నుంచి రూ. 870 వసూలు చేస్తుండగా అందులో రూ. 530 పరీక్ష ఫీజు ,ప్రాక్టికల్ ఫీజు రూ.240, ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఫీజు రూ.100 వసూలు చేస్తున్నారు.
అదనపు ఫీజు రూ.110
ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజును ప్రభుత్వం పెంచింది. గత ఏడాదికంటే రూ.10లను ప్రభుత్వం పెంచింది. గతంలో ఆర్ట్స్, సైన్స్ విద్యార్థులకు ఫీజు రూ.520 ఉండగా రూ.530 పెంచింది. దీని ప్రకారం ప్రతి విద్యార్థి పరీక్ష ఫీజు అదనంగా రూ.100 ఇంగ్లీష్ ప్రాక్టికల్స్‌తో కలిపి మొత్తం రూ.630 చెల్లించాలి.
16 నుంచి 17 లక్షల వసూలు
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 83 ప్రభుత్వ ,ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో సుమారు 15 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. కేవలం ఒక జిల్లా నుంచి 15 వేల మంది విద్యార్థులు ప్రవేశాల తీసుకోగా ప్రభుత్వం సుమారు రూ. 16 నుంచి రూ.17 లక్షల వరకు అదనంగా ఫీజు వసూలు చేస్తున్నది. పరీక్ష ఫీజు చెల్లించేందుకే ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థులు అదనపు బాదుడుతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఖజానా పెంచుకునేందుకు పేదలపై భారం
ప్రభుత్వ ,ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల గురించి అలోచించకుండా ఖజానా నింపుకోవడమే పనిగా పెట్టుకుంది. పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం అయితే వెంటనే పెంచిన ఫీజులు తగ్గించాలి లేదా పేద విద్యార్థులకు ఫీజు మాఫీ చేసి పరీక్షలు నిర్వహించాలి.
– బారి అశోక్ కుమార్, తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, సూర్యాపేట