యాదాద్రి భువనగిరి, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : మూసీ పునరుజ్జీవంపై కాంగ్రెస్ పార్టీ ముసలి కన్నీరు కారుస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్య గౌడ్ విమర్శించారు. మూసీ విధ్వంసానికి కారకులు ఎవరో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనే మూసీ పూర్తిగా కాలుష్యమైందని, దీనికి ఆ పార్టీనే బాధ్యత వహించాలని అన్నారు.
తాము మూసీ సుందరీకరణకు మాత్రమే వ్యతిరేకమని, శుద్ధి పనులకు కాదని స్పష్టం చేశారు. రైతులను పట్టించుకోకుండా పాదయాత్రలు, సుందరీకరణ అంటూ రేవంత్ రెడ్డి ఫొటోలకు ఫోజులిస్తున్నారని దుయ్యబట్టారు. కమీషన్ల కోసం రూ.1.5లక్షల కోట్లతో మూసీ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టను అద్భుతంగా తీర్చిదిద్దారని, మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు.
సీఎం యాదగిరిగుట్ట పర్యటన సందర్భంగా ఆలయ అభివృద్ధికి ఏం చేస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వృథా అని విమర్శిస్తున్న కాంగ్రెస్.. మల్లన్న సాగర్ నుంచి యాదగిరిగుట్టకు నీటికి ఎలా తీసుకొస్తున్నదని ప్రశ్నించారు. కేసీఆర్‌పై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పి కాళేశ్వరం జలాలను వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో రైతులు ఆగమైతుంటే జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోమటిరెడ్డి ఎక్కడికి పోయారని భిక్షమయ్యగౌడ్ ప్రశ్నించారు. జిల్లాలో పాలనను పట్టించుకునే వాళ్లు కరువయ్యారన్నారు. కోమటిరెడ్డి సమస్యలను పట్టించుకోకుండా కేవలం కమీషన్లపై దృష్టి పెట్టారని ఆరోపించారు. రైతుల ధాన్యం కొంటామని ఓ వైపు చెబుతూనే.. మరోవైపు దళారులతో కుమ్మక్కైన కాంగ్రెస్ సర్కారు ధాన్యం కొనుగోళ్లు చేయకుండా జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికే సగం మంది రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేట్‌లో క్వింటాకు రూ.1,800కే అమ్ముకొని తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులకు కనీస మద్ద తు ధర దక్కని పరిస్థితి ఏర్పడిందన్నారు.
రాష్ట్రంలో రైతులు చనిపోతుంటే రేవంత్‌రెడ్డికి పట్టడం లేదని భిక్షమయ్య విమర్శించారు. ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, తెలంగాణకు పట్టిన శని రేవంత్ రెడ్డి అని, ఆయన పాలనలో అన్నీ విధ్వంసాలే అని పేర్కొనానరు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎంకు చీమ కుట్టినట్లు లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల గడుస్తున్నా ప్రజలకు ఏమీ చేయలేదని, ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అడ్రెస్ లేవని దుయ్యబట్టారు.
తప్పులను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం శారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. పోలీసులతో భయటపెట్టి తమ గొంతులు నొక్కలేరన్నారు. ‘ఖబర్దార్.. రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికొస్తే మాడి మసై పోతావ్’ అని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొలుపుల అమరేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆంజనేయులు, మాజీ జడ్పీటీసీ బీరు మల్లయ్య, మాజీ ఎంపీపీ అతికం లక్ష్మనారాయణ గౌడ్, ఓం ప్రకాశ్, ఏవీ కిరణ్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, కుతాడి సురేశ్ పాల్గొన్నారు.