రామగిరి, నల్లగొండ ఏప్రిల్ 17 : ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీపడుతూ, నూతన ఒరవడిని అందిపుచ్చుకుంటూ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సేవలు మరింత విస్తరించాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. నల్లగొండ పానగల్ రోడ్డులో ఉన్న బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం జరిగిన టెలికాం సలహా సంఘం సమావేశానికి ఆయన హాజరై సంస్థ పురోభివృద్ధికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ.. మారుమూల ఏజెన్సీ, కొండ ప్రాంతాలకు బీఎస్ఎన్ఎల్ సేవలను విస్తరించాల్సి ఉందన్నారు.
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. వినియోగదారులకు సత్వరమే ఎటువంటి అంతరాయం లేని మెరుగైన సేవలందించేందుకు అధికారులు, ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బంది మరింత కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి, బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పాశ్యం వెంకటేశ్వర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ గురువయ్య, అధికారులు రవి ప్రసాద్, మురళీకుమార్ పాల్గొన్నారు.
Nalgonda : బీఎస్ఎన్ఎల్ సేవలు మరింత విస్తరించాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర