నీలగిరి, అక్టోంబర్ 01 : బీఎస్ఎన్ఎల్ స్థాపించిన పాతికేళ్ల కాలంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికి మారుమూల ప్రాంతాలకు సైతం 4జీ సేవలు అందించి దేశ టెలికాం రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించిందని బీఎస్ఎన్ఎల్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రిన్సిఫల్ జనరల్ మేనేజర్ పి.వెంకటేశం అన్నారు. భారత సంచార నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా బుధవారం సిల్వర్ జూబ్లీ వార్సికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులందరూ పట్టణంలో సంస్థ సర్వీసుల గురించి వివరిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్బర్ లో భాగంగా స్వదేశీ 4జీ మొబైల్ సాంకేతికతతో సుమారు లక్ష మొబైల్ టవర్లను దేశానికి అంకితం చేశారని తెలిపారు.
గతంతో కన్నా ఈ సంవత్సరం సేవలను మరింత మెరుగుపరుస్తూ ప్రజలకు అనుగుణంగా సేవలను అందిస్తూ ఎలాంటి రవాణా సౌకర్యాలు సక్రమంగా లేని 28 వేల మారుమూల గ్రామాలకు సైతం 1జీ సేవలను అందించినట్లు తెలిపారు. దీని ద్వారా మారుమూల గ్రామ, పల్లె, గిరిజన ప్రాంతాల్లో కూడా వినియోగదారులకు వేగవంతమైన మొబైల్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. దేశీయ టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ నిరంతరం ప్రజలకు ఆధునిక, చవక, నమ్మదగిన సేవలను అందిస్తూ ముందంజలో ఉంటూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన ఫ్రీడమ్ ప్లాన్ (1రూపాయితో సిమ్) కు అత్యంత ప్రజాదరణ లభించిందన్నారు. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ మొబైల్ సేవలు, ఎఫ్ఎటీహెచ్ సేవలు, ఎంపీఎల్ఎస్, వీపీఎస్, ఐఎఫ్ టీవీ, ఇంటర్నెట్ లీజ్ లైన్ సేవలు ద్వారా వినియోగదారులందరికీ సమగ్ర టెలికాం పరిష్కారాలను అందిస్తోందన్నారు.
అతి తక్కువ ధరలతో కొత్తగా ప్రవేశ పెట్టిన్ ఎస్ఐటీహెచ్ ప్యాకేజీలు రూ.299, రూ.899 లో భాగంగా వినియోగదారులకు ఇంటర్నెట్ అపరిమిత వాయిస్ కాల్స్, టీవీ ఛానెల్స్, ఓటీటీలు వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చాయన్నారు. బీఎస్ఎన్ఎల్ విశ్వసనీయ సేవలతో ప్రజలకు మరింత సమీపంగా ఉంటూ, ఆధునిక సాంకేతికతను అందించడంలో ఎల్లప్పుడు ముందంజలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం మురళీకృష్ణారెడ్డి, ఐఎస్ఏ సత్యనారాయణ, ఎజీఎంలు సుబ్బారావు, శరత్‌కుమార్, రాములు, సిబ్బంది ఉట్కూరి అశోక్ రెడ్డి, నరేందర్. వెంకన్న పాల్గొన్నారు.