నల్లగొండ రూరల్, మార్చి 7: యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో తెలంగాణ అకాడమీ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK)ను నీతిఆయోగ్ అభినందించడం పట్ల బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికైనా ఉద్యోగాల విషయంలో అబద్ధాలు చెప్పడం మానుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు. నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ 1.62 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారని నాగార్జున తెలిపారు. ప్రైవేటు రంగంలోనూ దాదాపు 9.80 లక్షల ఉద్యోగాలు కల్పించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు మైనం యుగేందర్, సిరిగిరి సురేశ్ రెడ్డి, లింగస్వామి గౌడ్, సైదులు, రాజు, సాగర్, శంకర్, లింగం తదితరులు పాల్గొన్నారు.