మిర్యాలగూడ/ నల్లగొండ/ హాలియా, నేరేడుచర్ల, మే 21 : ‘అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇంతవరకూ ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేసి మళ్లీ మోసపోవద్దు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. నల్లగొండ, సాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పదేండ్లు నిష్టతో తెలంగాణను అభివృద్ధి చేశామని, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా పరుగులు పెట్టించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఐటీ రంగం అభివృద్ధిలో దూసుకుపోయిందని, పది లక్షల మందికి ఐటీ ద్వారా ఉద్యోగాలను కల్పించామని చెప్పారు. ఈ సారి గెలిస్తే మిర్యాలగూడకు ఐటీ తీసుకొచ్చేవాళ్లమని తెలిపారు. ఐటీ ఎగుమతులను రూ.57వేల కోట్ల నుంచి రూ.2లక్షల కోట్లకు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.
ఒక వైపు ఐటీ, మరోవైపు వ్యవసాయాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నెం.1 అయితే.. రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉన్నదని తెలిపారు. 2014 నాటికి నల్లగొండలో ఒక్క మెడికల్ కాలేజీ లేదని, కేసీఆర్ నాయకత్వంలో మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం 1.8శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయిందని, పని చేసి కూడా చెప్పకోలేకపోవడంతోనే ఓటమి పాలయ్యామని తెలిపారు. పదేండ్లలో భారతదేశంలో అత్యధికంగా ప్రభుత్వ కొలువులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రమేనన్నారు. 2లక్షల ఉద్యోగాలను ఇచ్చి కూడా బీఆర్ఎస్ చెప్పుకోలేదన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, గాడిద గుడ్డు మాత్రం వచ్చిందని విమర్శించారు. కేంద్రంలోని బడే భాయ్ నరేంద్ర మోదీ ఏటా నిరుద్యోగులకు 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్తే.. చోటే భాయ్ రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఏటా 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పుడు కావాల్సింది తెలంగాణ అధికార స్వరం కాదు.. ధిక్కార స్వరం, శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక కావాలని సూచించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపిస్తే శాసనమండలిలో ప్రశ్నించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏం చదువుకున్నాడో తెలియదని, కానీ.. యూట్యూబ్ చానెల్ పెట్టి బెదిరించి డబ్బులు గుంజే తెలివి బాగుందని పేర్కొన్నారు. జర్నలిస్టు ముసుగులోనే ఇంత మందిని బ్లాక్ మెయిల్ చేసిండని, పొరపాటున గెలిపిస్తే కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆగమాగం చేస్తాడని హెచ్చరించారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ది అభయ హస్తం కాదు.. భస్మాసుర హస్తమని విమర్శించారు. ఉన్నత చదువులు చదివి గోల్డ్‌మెడల్ సాధించిన రాకేశ్‌రెడ్డికి ఓటు వేస్తే ప్రజా గొంతుకగా నిలుస్తాడన్నారు. హుజూర్నగర్ లోకల్ వ్యక్తి అని ఆయనను నాయకుడిని చేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. పార్టీని మోసం చేసి వేరే పార్టీలోకి పోయాడని పేర్కొన్నారు. అయన పోయినంత మాత్రాన మనకు పోయిందేమీ లేదని, ఆయన సొంత గ్రామ సర్పంచ్ కూడా ఆయనతో పోలేదని ఎద్దేవా చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోనే నీళ్లు లేక పొలాలు ఎండిపోయాయని, గ్రామాల్లో తాగునీరు లేక గొంతెండుతుందని పేర్కొన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తిట్టిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఆయన కాళ్లు మొక్కుతున్నాడని ఎద్దేవా చేశారు. మహిళలకు రూ.2500 భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని, రూ.15వేల రైతుబంధు, కౌలు రైతులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, ఆటో డ్రైవర్లకు నెలకు రూ.వెయ్యి ఇస్తామని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఇన్ని మోసాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు, గాదరి కిశోర్‌కుమార్, నోముల భగత్, భిక్షమయ్యగౌడ్, విజయసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్ గౌడ్, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, కటికం సత్తయ్య గౌడ్, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రాంచందర్‌నాయక్, రాజీవ్‌సాగర్, యడవల్లి విజయేందర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రావు, కడారి అంజయ్యయాదవ్, మోసిన్ అలీ, అన్నభీమోజు నాగార్జునచారి, చీర పంకజ్ యాదవ్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, నిరంజన్ వలీ, బొర్ర సుధాకర్, తండు సైదులు గౌడ్, మందడి సైదిరెడ్డి, కొండూరు సత్యనారాయణ, బక్క పిచ్చయ్య, మాలె శరణ్యారెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బోనగిరి దేవేందర్, కరీంపాషా పాల్గొన్నారు.
బ్లాక్ మెయిలర్స్కు కాదు.. విద్యావంతులకు అవకాశం ఇవ్వండి
‘పెద్దల సభ అంటే మేధావుల సభ. అది బ్లాక్ మెయిలర్స్కు అడ్డా కాకుండా ఉండాలంటే విద్యావంతుడు, వినయుడు అయిన ఏనుగుల రాకేశ్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలి. కాంగ్రెస్ అభ్యర్థి నేచర్ బ్లాక్ మెయిల్ తత్వం. అలాంటి వాళ్లకు ఓటేస్తే మండలి బ్లాక్ మెయిలర్స్కు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. రోజుకో పార్టీ మారి ఆ పార్టీలోని వ్యక్తులనే నిత్యం తిట్టిపోసిన ఘనుడికి కాంగ్రెస్ పార్టీ సీటు ఇవ్వడం సిగ్గుచేటు. బిట్స్ పిలానీలో చదివి అమెరికాలో మంచి ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేయడానికి వచ్చిన రాకేశ్‌రెడ్డిని ఆశీర్వదించి మండలికి పంపాలి. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి ప్రపంచం మొత్తానికి పరిచయం చేసి పారిశ్రామికవేత్తలు భారతదేశంలో ఏ పరిశ్రమ పెట్టాలన్నా అది హైదరాబాద్‌కే రావాలని అద్భుతంగా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌దే. ఈ దేశంలో 20లక్షల మందికి ఉపాధి కల్పించిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. బీజేపీ అభ్యర్థి ఒక అసమర్ధుడు. ఆయన చాలాకాలంగా రాజకీయాల్లో ఉంటున్నాడు. కానీ.. ఏ సమస్యపైనా స్పందించని వ్యక్తి. ప్రశ్నించే గొంతుక కావాలో.. లేదంటే బ్లాక్ మెయిలర్ కావాలో.. లేక అసమర్థ నాయకుడు కావాలో.. నిర్ణయించుకోవాలి.’
అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
అడ్డగోలు హామీలు ఇచ్చి అబద్ధపు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఐదు నెలల్లోనే రాష్ర్టాన్ని సర్వనాశనం చేసింది. పట్టభద్రులు విచక్షణతో ఆలోచించి ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి. 420 హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన పక్కన పెట్టి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ను తిట్టడం ఎంతవరకు సమంజసం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది.. ప్రస్తుత కాంగ్రెస్ ఏం చేస్తుందో పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలి.
– వి.శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి
నిజానికి, అబద్ధానికి మధ్య జరుగుతున్న యుద్ధమిది
ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది నిజానికి, అబద్ధానికి మధ్య యుద్ధం. ఇది రాకేశ్‌రెడ్డి, మల్లన్న మధ్య యుద్ధం కాదు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య యుద్ధం కాదు. ఇది పది సంవత్సరాల నిప్పు లాంటి నిజమైన కేసీఆర్ పాలన మధ్య ఆరు నెలల నయవంచక కాంగ్రెస్ పాలన మధ్య జరుగుతున్నది. ఆ యుద్ధంలో బీఆర్ఎస్ అభ్యర్థ్ధి రాకేశ్‌రెడ్డికి ఓటు వేసి పట్టభద్రులు నిజం వైపు నిలబడాలి. తీన్మార్ మల్లన్న పెద్ద బ్లాక్ మెయిలర్. మైనర్లు, మహిళలను సైతం బ్లాక్ మెయిల్ చేస్తే ఆ కేసు తన దగ్గరకే వచ్చింది. ఆడపిల్లలకు సంబంధం లేకుండా వారి ఫోన్ నెంబర్లు సోషల్ మీడియాలో పెట్టి ఆ కుటుంబాలను ఎంతో ఇబ్బంది పెట్టాడు. 76 కేసులు ఉన్న తీన్మార్ మల్లన్న ఈ సమాజానికి చీడ పురుగులాంటి వాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై అన్యాయంగా కేసులు పెట్టిందని చెప్పుకొనే మల్లన్నను కోర్టు ఎందుకు శిక్షించిందో చెప్పాలి. ప్రభుత్వం అనవసర కేసులు పెడితే కోర్టు తోసిపుచ్చుద్ది. అలాంటిది తీన్మార్ మల్లన్న విషయంలో జరుగలేదంటే అవన్నీ నిజమైన కేసులే. పట్టభద్రులు ఎవరికి ఓటు వేయాలో విచక్షణతో ఆలోచించాలి. విద్యావంతుడు, సౌమ్యుడు ఎవరో చూడాలి. అసత్యం, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఈ ఐదు నెలల్లో రాష్ర్టాన్ని సర్వనాశనం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్లాక్ మెయిలర్‌కు టికెట్ ఇవ్వడం దారుణం. నిత్యం బ్లాక్ మెయిల్ చేసే తీన్మార్ మల్లన్నకు ఓటేస్తే రానున్న రోజుల్లో అలాంటి వారు ఎందరో పుట్టుకొస్తారు. అలాంటి వ్యక్తులను ఓడించి మేధావి అయిన రాకేశ్‌రెడ్డిని మండలికి పంపాలి.
– ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
ఎమ్మెల్సీగా గెలిపిస్తే నా గౌరవ వేతనం నిరుద్యోగులకే ఖర్చు చేస్తా
పట్టభద్రుల ఎమ్మెల్సీగా నన్ను గెలిపిస్తే ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం నిరుద్యోగుల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌కు పత్రాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం కాంగ్రెసోళ్లకే చెల్లింది. డిసెంబర్ 9న హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ సర్కారు మాటలు ఏమాయ్యాయి? ఐదు నెలలైనా ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్, డీఎస్సీ నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు పీఆర్సీ ఎందుకు ఇవ్వలేదు. జీఓ 46 ద్వారా కొంత మందికి అన్యాయం జరిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం సరిదిద్దే సమయంలో ఎన్నికల కోడ్ వచ్చింది. అధికారంలోకి రాగానే రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ఎందుకు చేస్తలేదు. విచక్షణ కలిగిన పట్టభద్రులు.. బ్లాక్ మెయిలర్స్ ఎవరో, మంచివారు ఎవరో ఆలోచించి ఓటు వేయాలి. చుక్కా రామయ్య నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి వరకు విద్యావంతులనే మండలికి పంపారు. జర్నలిజం ముసుగులో ఎర్నలిస్టుగా మారిన వ్యక్తులకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ అభ్యర్ధి గెలిస్తే జాబ్ క్యాలెండర్, పీఆర్సీ, మెగా డీఎస్సీ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేడు. నన్ను గెలిపిస్తే నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. రాకేశ్‌రెడ్డి గెలిస్తే ఉద్యోగి గెలిచినట్లు, బీఆర్ఎస్ను బలోపేతం చేస్తేనే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది.
– ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి
రైతు వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
ప్రజలకు, రైతులకు మాయమాటలు చెప్పి, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పింది. 420 హామీలను ఇచ్చి వాటి ఊసే ఎత్తడం లేదు. తినే అన్నంలో మట్టి పోసుకున్నట్లుగా ప్రజలు సీఎం కేసీఆర్‌ను దూరం పెట్టారు. ఇప్పుడు ప్రజలకు తెలిసి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గ్రామ గ్రామాన పటిష్టంగా ఉన్నది. ఎవరో పోయినంత మాత్రాన పార్టీకి నష్టం లేదు. నాయకులు, కార్యకర్తలంతా రాకేశ్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలి.
– మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
రాకేశ్‌రెడ్డిని గెలిపించాలి
నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి ఈ ప్రాంత గ్రాడ్యుయేట్లు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. గతంలోనూ ఈ ప్రాంత ఓటర్లు ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించారు. హామీల అమలులో విఫలం చెందిన కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేందుకు రాకేశ్‌రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉన్నది.
-ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి పార్టీ సత్తా చాటాలి. తొమ్మిదిన్నరేండ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో పట్టభద్రులు గుణపాఠం చెప్పాలి. తొమ్మిదిన్నరేండ్లలో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంచా. ఇకముందు కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేసి వారికి అండగా ఉంటా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ అందించాలి.
– మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
మాయ మాటలను చెప్పే కాంగ్రెస్‌ను నమ్మవద్దు
కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి, మాయదారి హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 9న రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి నేటికీ చేయలేదు. వృద్ధులకు పింఛన్ రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు, మహిళలకు రూ.2500 భృతి, నిరుద్యోగులకు రూ.4వేల భృతి, యువతులకు స్కూటీలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే రాకేశ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి.
– మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి