 
                                                            కొండమల్లేపల్లి, అక్టోబర్ 30: కొండమల్లేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన అందుగుల వెంకటయ్య, సైదమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె ప్రవళిక..మల్లారెడ్డి కళాశాలలో నాలుగో సంవత్స రం మెడిసిన్ చదువుతోంది. ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో రెండో కుమార్తె తేజశ్రీకి మంచి ర్యాంకు రావడంతో రామగుండం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. అయితే వారిది నిరుపేద కుటుంబం కావడంతో ఎంబీబీఎస్ చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డువచ్చాయి. దాతలు మందుకొచ్చి చదివిస్తే చదువుకుంటామంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ కావడంతో కొందరు ఆర్థిక సాయం అందజేశారు.
సామాజిక కార్యకర్త గురిజ మహేశ్ అక్కచెల్లెళ్ల చదువుకు ఆర్థిక సాయం చేయాలంటూ సోషల్ మీడియా, ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ పోస్టుపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి విద్యార్థినులు ప్రవళిక, తేజశ్రీలను పిలిపించి ఎంబీబీఎస్ పూర్తి చేసి, డాక్టర్లయ్యేంతవరకు ఆర్థిక సా యం అందిస్తానని హామీ ఇచ్చారు. దీంతో పాటు తేజశ్రీకి రూ.1.23 లక్షలు, ప్రవళికకు ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరానికి సంబంధించి కాలేజీ, హాస్టల్ ఫీజుల కింద రూ.1.80 వేలు అందజేశారు.
అక్కాచెల్లెళ్లను ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు ఆదుకుంటామని, మంచిగా చదువుకొని వైద్య వృత్తి చేపట్టి నిరుపేదలకు వైద్య సేవలు అందించాలని కేటీఆర్ సూచించారు. పేదిరికం కారణంగా ఎంబీబీఎస్, ఐఐటీ తదితర ఉన్నత చదువులు చదవలేక ఇబ్బందులు పడే విద్యార్థులు ఎవరైనా ఉంటే ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. పైచదువులకు ఆర్థిక సాయంతో పాటు డాక్టర్లయ్యేంత వరకు ఆదుకుంటామని హామీ ఇచ్చిన కేటీఆర్‌కు ప్రవళిక, తేజశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. పేద విద్యార్థులకు ఆర్థిక సా యం అందజేయడంలో కేటీఆర్ మనసున్న మారా జు అంటూ పలువురు కొనియాడారు. కార్యక్రమం లో మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, వెంకటయ్య, సైదమ్మ ఉన్నారు.
 
                            