యాదాద్రి భువనగిరి, (నమస్తే తెలంగాణ)/యాదగిరిగుట్ట/భువనగిరి కలెక్టరేట్, మే 19 : ‘ఉన్నత విద్యావంతుడు, మేధావి, రైతు బిడ్డ, బిట్స్ ఫిలానీలో గోల్డ్ మెడలిస్ట్, నిజాయితీగా ప్రశ్నించే వ్యక్తి ఏనుగుల రాకేశ్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించి ఆశీర్వదించండి’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. భువనగిరి, ఆలేరు పట్టణాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆదివారం నిర్వహించిన రెండు నియోజకవర్గాల బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.
పట్టభద్రులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సార్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తున్నదని, ఈ సారి కూడా విజయం మనదేనన్నారు. రాకేశ్ రెడ్డి స్వయంకృషితో ఎదిగారని, ఉన్నత విద్యావంతుడు అని చెప్పారు. అమెరికాలో మంచి ఉద్యోగం వదులుకొని సొంత గడ్డకు సేవ చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తున్నారని తెలిపారు. ఓ వైపు బిట్స్ ఫిలానీలో చదువుకున్న గోల్డ్ మెడలిస్ట్ ఉండగా, మరోవైపు బ్లాక్‌మెయిలర్, సొల్లు కబుర్లు చెప్పే మోసగాడు ఉన్నాడని, పట్టభద్రులు ఆలోచించి ఓట్లేయాలని కోరారు.
తెలంగాణలోనే అత్యధికంగా వడ్లు పండించిన జిల్లాగా ఉమ్మడి నల్లగొండ నిలిచిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయన్నారు. కరెంట్ లేదు.. రైతుబంధు రాదు.. రైతు బీమా పత్తాకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుకు రైతుబీమా, రైతు కూలీలు, ఆటో డ్రైవర్లకు ఆర్థికసాయం ఊసేలేదన్నారు. నాట్లేసే సమయంలో రైతుబంధు డబ్బులు ఇవ్వని సీఎం రేవంత్‌రెడ్డికి ఓట్లేసే సమయంలోనే రైతులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని తెలిపారు. పండించిన పంట కల్లాల్లోనే ఉందని, దానిని అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట కొండపైకి 300 ఆటోలకు అనుమతి ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి… రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్డుమీదికి తెచ్చి వారి బతుకులను నట్టేట ముంచారని మండిపడ్డారు.
ఆటో నడువక, కుటుంబాలు గడువక ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 73 శాతం వేతనాలను పెంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలిచామన్నారు. పదేండ్లలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత గత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. 2 లక్షల ఉద్యోగాలిచ్చిన మొనగాడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా చూపించమని కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ప్రశ్నిస్తే వారి వద్ద జవాబు లేదని చెప్పారు. ఇక్కడి పట్టభద్రుల్లో 99 శాతం మంది రైతు బిడ్డలేనని, అధికారంలోకి వచ్చిన మొదటి రోజే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శిక్షించాలా వద్దా ఆలోచించాలని కోరారు. వాస్తవాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, పరీక్షలు పెట్టలేదని, ఇంటర్వ్యూలు నిర్వహించలేదని, కానీ 30వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి విష ప్రచాచారానికి దిగారని తెలిపారు. మంది బిడ్డను తన బిడ్డ అని చెప్పుకునే దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ అని మండి పడ్డారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలని చెప్పిన నాయకుడికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ వెయ్యేండ్లు చరిత్రలో నిలిచిపోయే విధంగా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. ఇంత చేసినా ప్రచారం చేసుకోవడంలో మనం విఫలమయ్యామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్లోనే మెగా డీఎస్సీ వేస్తామని చెప్పిన గొప్పలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
నిరుద్యోగ భృతి, జాబ్ గ్యారెంటీ, తొలి సంవత్సరంలో రెండు లక్షలు ఉద్యోగాలు పత్తాలేవన్నారు. ఫ్రీగా టెట్ పెడుతామని చెప్పారని, కానీ గతంలో కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని కడిగిపారేసే నాయకుడు ఉండాలే గానీ, ఆయన పక్కన కూర్చుని సన్నాయి నొక్కులు నొక్కేవాళ్లకు ఓటు వేయవద్దని సూచించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి మోసం చేసిన బీజేపీకి ఓటేస్తే లాభం లేదన్నారు. రాకేశ్ రెడ్డి అన్ని ప్రాంతాలకు తిరిగే సమయం లేదని, వారం రోజులు కేడర్ సీరియస్ తీసుకొని కష్టపడాలని, ఒక్కొక్కరు పది మందికి తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ప్రశ్నించే గొంతుక రాకేశ్‌రెడ్డిని చట్టసభలకు పంపించి. కేసీఆర్‌కు బలం చేకూర్చాలని కోరారు. అందరూ తొలి ప్రాధాన్యత ఓటు రాకేశ్‌రెడ్డికి వేసి గెలిపించాలన్నారు. పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్, జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, విద్యార్థి నాయకులు గెల్లు శ్రీనివాస్, తుంగ బాలు, బీఆర్ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో పట్టభద్రులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే వచ్చే జీతంతో విద్యార్థి, ఉద్యోగ సహాయనిధిని ఏర్పాటు చేసి నిరుద్యోగులకు అండగా ఉంటాను. కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు అండగా నిలుస్తాను. కష్టపడి చదువుకొని ఉన్నతమైన స్థాయికి ఎదిగాను. దొంగ హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి.. ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు. నిరుద్యోగ భృతి లేదు.. ఫీజు రాయితీ ఊసేలేదు, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. విద్యావంతులు, మేధావులు ఆలోచించి .. శాసన మండలి సభకు మేధావులనే పంపాలి.. మోసగాళ్లను పంపొద్దు. ప్రశ్నించే వాడిని ఎన్నుకుంటారో.. ప్రభుత్వానికి తొత్తులుగా మారిన వాడిని ఎన్నుకుంటారో పట్టభద్రులు ఆలోచన చేయాలి. రైతు బిడ్డనైన నాకు రైతుల కష్టాలు తెలుసు. అన్నివర్గాల ప్రజల సమస్యలపై అవగాహన ఉంది. వారి కోసం పెద్దల సభలో పోరాడుతా.
– ఏనుగుల రాకేశ్‌రెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి
హామీల అమలులో అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆపార్టీకి బుద్ధి చెప్పాలి. పట్టభద్రులందరూ సౌమ్యుడైన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించాలి. ఈప్రాంత సమస్యలపై అవగాహన కలిగి ఉండి, సేవ చేయాలనే తలంపుతో వచ్చిన రాకేశ్‌రెడ్డికి పట్టభద్రులు, మేధావులు అండగా ఉండాలి.
– బడుగుల లింగయ్యయాదవ్, రాజ్యసభ మాజీ సభ్యుడు