యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఓ వైపు కాంగ్రెస్ అధికారం.. మరోవైపు క్యాం పులు, ఇంకో వైపు ఓటుకు 15వేలతో ప్రలోభాలు.. కానీ అంతిమంగా పాడి రైతులు బీఆర్ఎస్కే పట్టం కట్టారు. ఎన్ని డ్రామాలు, వ్యూహాలు పన్నినా మదర్ డెయిరీ ఎన్నికల్లో గులాబీ పార్టీకే జై కొట్టారు. మూడిం టి రెండు స్థానాల్లో ఉద్యమ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభావం చవిచూసింది. ఆ పార్టీ అనుబంధ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నా ఓటమిపాలవడంతో విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు చుక్కెదురైంది.
ఉమ్మడి నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమాఖ్య లిమిటెడ్ (నార్ముల్)లో మూడు డైరెక్టర్ స్థానాలు ఖాళీలు కావడంతో ఎన్నికలు అనివార్యమైంది. ఇటీవల నోటిఫికేషన్ విడుదల కావడంతో వివిధ ప్రక్రియల అనంతరం తొమ్మిది అభ్యర్థులు బరిలో నిలిచారు. శనివారం హయత్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఎన్నిక నిర్వహించారు.
ఇందులో ఉదయం జరిగిన పోలింగ్‌లో 308 మంది పాల సంఘం చైర్మన్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం తర్వాత ఓట్ల లెక్కిం పు చేపట్టారు. మూడు స్థానాల్లో రెండింటిలో బీఆర్ఎస్ అనుబంధ అభ్యర్థులు విజయం సాధించారు. రెండు జనరల్ స్థానాలకు రాజాపేట మండలానికి చెందిన సందిల భాస్కర్ గౌడ్, మోత్కూరుకు చెందిన రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి గెలుపొందారు. మదర్ డెయిరీ చరిత్రలోనే తొలిసారి భాస్కర్ గౌడ్‌కు 240 ఓట్లు సాధించారు. ఈయన గతంలోనే డెయిరీ డైరెక్టర్‌గా పనిచేశారు. లక్ష్మీనరసింహారెడ్డి (154 ఓట్లు) సైతం డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, మరోసారి అవకాశం దక్కింది. జనరల్ మహిళ స్థానంలో 176 ఓట్లతో కర్నాటి జయశ్రీ గెలిచారు. ఈమె ఇటీవల వరకు బీఆర్ఎస్లోనే కొనసాగగా, ఇప్పటి వరకు పార్టీ మారినట్లు ఎక్కడా కండువా కప్పుకోలేదనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో జయశ్రీ గెలుపు కూడా బీఆర్ఎస్ ఖాతాలోకి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
క్యాంపులు పెట్టినా.. డబ్బులు పంచినా..
కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఎలాగైనా మదర్ డెయిరీ డైరెక్టర్ స్థానాలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ భావించింది. ఇందుకోసం అన్ని విధాగాలుగా విశ్వప్రయత్నాలు చేసింది. రెండు రోజులు ముందుగానే హైదరాబాద్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్‌కు ఓటర్లను తరలించి క్యాంపులకు తెరలేపింది. అక్కడే వారికి అన్ని విధాలుగా రాచమర్యాదలు చేసింది. ఒక్కో ఓటరుకు ఏకంగా రూ. 15వేలను పంపిణీ చేసింది. తమ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించింది. శనివారం ఎన్నికలు కావడంతో నేరుగా క్యాంపుల నుంచి పోలింగ్ కేంద్రాలకు స్వయంగా తరలించింది. ఇన్ని చేసినా ఓటర్లు మాత్రం కాంగ్రెస్‌కు మొండిచెయ్యే చూపించారు. కనీసం రెండు స్థానాలు సునాయాసంగా గెలుస్తామనే ధీమాతో ఉన్న ఆ పార్టీ రైతులు భారీ షాక్ ఇచ్చారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో విప్ బీర్ల ఐలయ్యకు చుక్కెదురైందని చెప్పవచ్చు. డెయిరీలోని 308 చైర్మన్లలో సుమారు 180 మందికి పైగా ఆలేరు నియోజకవర్గానికి చెందిన వారే ఉంటారు. ఇందులోనూ 90శాతం మంది వరకు కాంగ్రెస్ సానుభూతిపరులు ఉన్నారు. కానీ వీరిలో అధిక శాతం మంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లే వేయకపోవడం విశేషం.
పాలక వర్గం అట్టర్‌ప్లాఫ్..
బీఆర్ఎస్ హయాంలో మదర్ డెయిరీ సజావుగానే నడిచింది. కానీ గతేడాది చైర్మన్‌గా గుడిపాటి మధుసూదన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కష్టాలు షురూ అయ్యాయి. కనీసం రైతులకు పాల బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే ఏడు బిల్లులు పెండింగ్‌లో మూలుగుతున్నాయి. అధికారంలోకి వస్తే బోనస్ ఇస్తామని ఉత్తుత్తి హామీలు ఇచ్చినా అదీ పత్తాలేదు. మదర్‌డెయిరీ నుంచి హాస్టళ్లు, ఆలయాలకు పాలు, నెయ్యి బంద్ చేసినా పట్టించుకునే నాథుడే లేడు. పైగా నార్ముల్ ఆస్తుల అమ్మకానికి పూనుకున్నారు. ఇలా అనేక విషయాల్లో ప్రస్తుత పాలకవర్గం అట్టర్‌ఫ్లాప్ కావడంతో సొసైటీ చైర్మన్లు కాంగ్రెస్ అభ్యర్థులకు చురుకు అంటించారు.
ఫలించిన మహేంద్రుడి మంత్రాంగం..
నార్ముల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు రెండు స్థానా లు కైవసం చేసుకోవడంలో డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మార్గదర్శనంలో తెరవెనక ఉండి మంత్రాంగం నడిపించారు. అధికశాతం మంది ఓటర్లు ఆలేరు నియోజకవర్గానికి చెందిన వారే కావడంతో ఆయన రంగంలోకి దిగి చక్రం తిప్పారు. అందరూ పరిచయం ఉన్నోళ్లు కావడంతో మూడోకంటికి తెలియకుండా రాజకీయ చేసి ఓట్లు రాబట్టడంలో సఫలీక్రుతుడయ్యారు. ఇవే ఫలితాలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఉంటాయని మహేందర్ రెడ్డి చెప్పారు.