సూర్యాపేట, నవంబర్ 24(నమస్తేతెలంగాణ) : ఈ నెల 26న సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరుగనున్న పార్టీ జిల్లా సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ కోరారు. సూర్యాపేటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి ఈ నెల 26న జిల్లా స్థాయి సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు.
దీనికి జిల్లా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, నాయకులు ఉప్పల ఆనంద్, నెమ్మాది భిక్షం, బాషా, ముద్ద మధుసూదన్‌రెడ్డి, రవిందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్24(నమస్తే తెలంగాణ) : ఈ నెల 29వ తేదీన పెద్దఎత్తున నిర్వహించనున్న దీక్షా దివస్‌కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల వారీగా ఇన్చార్జిలను నియమించారు. నల్లగొండకు మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, సూర్యాపేట జిల్లాకు మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, యాదాద్రి భువనగిరికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని నియామకం చేశారు. వీరు నేడు, రేపు ఆయా జిల్లాలోని పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో దీక్షా దివస్ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు.