పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా అంతటా మంగళవారం జరుగనున్న బీఆర్ఎస్
పండుగకు సర్వం సిద్ధమైంది. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతినిధుల సభల నిర్వహణకు ఏర్పాట్లు
పూర్తయ్యాయి. ఒక్కో నియోజకవర్గంలో మూడు నుంచి నాలుగు వేల మంది వరకు పార్టీ శ్రేణులు
ప్రతినిధులుగా హాజరుకానున్నారు. ఎమ్మెల్యేల సారథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సభలు
జరుగాలని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేసిన విషయం
తెలిసిందే. అందుకనుగుణంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. గ్రామాల్లో పార్టీ జెండాల ఆవిష్కరణతో మొదలై అందరూ నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే సభకు తరలిరావాల్సి ఉంది. అక్కడ నిర్ధిష్ట షెడ్యూల్ ప్రకారం సభ కొనసాగనుంది. ఇందులో ప్రధానంగా ఆరు రాజకీయ తీర్మానాలతోపాటు స్థానిక అంశాలపైనా పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. సభల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాలను
చాటిచెప్పడంతోపాటు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపైనా ప్రధానంగా చర్చించనున్నారు. రానున్న ఎన్నికలకు క్యాడర్ను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసేలా ఈ సభలు జరుగనున్నాయి.
– నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ)
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత సాగిన రాష్ట్ర సాధన ఉద్యమ ప్రస్తావాన్ని గుర్తు చేసుకుంటూనే తొమ్మిదేండ్లల్లో స్వరాష్ట్రంలో సాగుతున్న ఉజ్వల ప్రయాణాన్ని సమీక్షించునేలా బీఆర్ఎస్ ప్రతినిధుల సభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ 22వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం అన్ని నియోజకవర్గాల్లో సభలకు రూపకల్పన చేశారు. ఇందులో పార్టీకి చెందిన అన్ని స్థాయిల నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా ఇప్పటికే ఆహ్వానాలను పంపారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతినిధుల సభలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభల ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపేలా కార్యచరణ రూపొందించారు. ముందుగా అన్ని గ్రామాల్లోనూ ఉదయం 9 గంటల వరకు పార్టీ జెండాలు ఎగరవేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే జిల్లా అంతటా పార్టీ దిమ్మెలకు రంగులు వేసి కొత్తగా ముస్తాబు చేశారు. పార్టీ తోరణాలతో జెండా దిమ్మెలను అలకంరించారు. పార్టీ శ్రేణులంతా కలిసి జెండా పండుగలో పాల్గొని అక్కడి నుంచి నియోజకవర్గ కేంద్రంలో జరిగే ప్రతినిధుల సభకు తరలిరానున్నారు. అక్కడ ముందుగా మండలాలా వారీగా ప్రతినిధుల నమోదు ఉంటుంది. తర్వాత పార్టీ జెండా ఆవిష్కరణతో ప్రతినిధులు సభ ప్రారంభం కానుంది. ఒక్కో నియోజకవర్గ సభలో 3 నుంచి 4వేల మంది వరకు ప్రతినిధులు పాల్గొనున్నారు.
మోదీ సర్కార్ వైఫల్యాలపై..
రాజకీయ తీర్మానాల్లో తెలంగాణలో జరుగుతున్న సమగ్ర అభివృద్ధ్దికి అత్యంత ప్రాధాన్యతనిస్తూనే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షతో పాటు దేశంలో ప్రజల ఇబ్బందులపైనా ప్రధానంగా చర్చ చేయనున్నారు. ఐదో రాజకీయ తీర్మానంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల, ఇతర ధరల పెరుగుదలపై కూలంకుశంగా చర్చ చేయనున్నారు. వీటి వల్ల సామాన్యుల జీవితాలు ఛిద్రమవుతున్న తీరుపై స్పందించనున్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షను, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ట్రానికి మొండి చేయి చూపుతున్న విధానాలను పార్టీ శ్రేణులకు వివరించనున్నారు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలు విషయంలో నిర్లక్ష్యంపైనా చర్చ చేయనున్నారు.
మునుగోడు నియోజకవర్గం మర్రిగూడలో ఫ్లోరైడ్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని నేటికీ అతిగతీ లేదు. ఇక బీబీనగర్, ఎయిమ్స్ విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం, జాతీయ రహదారుల విస్తరణ, రైల్వేలైన్ల మంజూరులోనూ జాప్యం, కృష్ణా జలాల్లో నీటి వాటా తేల్చడంలో నాన్చివేత ధోరణితో జిల్లా ప్రాజెక్టులకు కలుగుతున్న ఆటంకాలు, తదితర కేంద్ర ప్రభుత్వ సంబంధిత అంశాలపైనా చర్చించేలా కార్యచరణ సిద్ధ్దం చేశారు.
ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందడం.. జాతీయ పార్టీగా అవతరించడం ఒక చారిత్రక అవసరమనే విషయాన్ని సభల ద్వారా మరోసారి పార్టీ శ్రేణులకు వివరించనున్నారు. కేసీఆర్ అంటే సంక్షేమం.. మోదీ అంటే సంక్షోభం…అనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు వచ్చే ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేసేలా ప్రతినిధులు సభలు జరిగేలా సర్వం సిద్ధ్దం చేశారు.
తీర్మానాలకు ప్రాధాన్యత
రాష్ట్ర సాధన కోసం సాగించిన తెలంగాణ ఉద్యమంలోని ప్రధాన ఘట్టాలను ఓ సారి నెమరువేసుకుంటూ ప్రస్తుతం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధ్దిపైనే ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. వీటి ఆధారంగానే నేతల ప్రసంగాలు, తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతినిధుల సభ నిర్వహణపై ప్రత్యేకంగా సూచనలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ హాట్రిక్ విజయం సాధించేలా క్యాడెర్లో సమరోత్సాహా నింపడంతో పాటు రాష్ట్రం పట్ల బీజేపీ అన్యాయాలను, కేంద్ర ప్రభుత్వ మోసాలను పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేలా సమాచారం అందించనున్నారు. ప్రధానంగా ఆరు రాజకీయ తీర్మానాలను చేయనున్నారు.వ్యవసాయం, సంక్షేమ రంగం, విద్యా ఉపాధి రంగాలు, పల్లె ప్రగతి-పట్టణ ప్రగతి, బీజేపీ-మోదీ సర్కార్ వైఫల్యాలు, కీలకమైన స్థానిక అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాలపై రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. వీటిపై ఒక్కో రంగంపై ఒక్క ప్రతినిధి తీర్మానం ప్రవేశపెడితే మరొకరు బలపర్చనున్నారు. ఇక వీటితో పాటు నియోజకవర్గాల వారీగా స్థానికంగా ఉన్న ప్రత్యేక పరిస్థితులపైనా తీర్మానాలు చేయనున్నారు.