మఠంపల్లి,అగస్టు 16 : సీఎం పదవిలో ఉన్నాననే సోయి లేకుండా, వేదికతో సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని, ఇది రాష్ట్ర ప్రజలను అవమానించినట్లేనని బీఆర్ఎస్పార్టీ రాష్ట్ర నాయకుడు, నియోజకవర్గ ఇంచార్జి ఒంటెద్దు నర్సింహారెడ్డి అన్నారు. శనివారం మఠంపల్లిలో పార్టీ మండల అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణాలో గత 10 ఏండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 3 లక్షల 15వేల కోట్లు మాత్రమేనని, కాగ్ నివేదిక, కేంద్ర మంత్రుల సైతం పార్లమెంటు సాక్షిగా చెబుతున్నా రేవంత్ అదే పనిగా 10లక్షల కోట్ల అప్పంటూ నిస్సిగ్గుగా మాట్లాడడం విడ్డూరమన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 75 వేల కోట్లు అప్పులు మన వాటాగా రాగా.. కేసీఆర్ ప్రభుత్వం 4లక్షల 25వేల కోట్ల సంపదను సృష్టించారన్నారు. ఇదే విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా రాతపూర్వకంగా కేంద్రం చెప్పిందన్నారు. ఈ వార్త మీడియాలో కూడా వచ్చిందన్నారు. ఓట్లకు ఓట్లకు మధ్య రైతు భరోసా, రుణమాఫీ ఇస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ అంతటా యూరియా కొరత ఉందని, రైతులతో పాటు మహిళలు సైతం క్యూలో చెప్పులు పెట్టి పడిగాపులు కాస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముందస్తుగానే యూరియా నిల్వలను స్టాక్‌లో ఉంచి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశారన్నారు. మంత్రి ఉత్తమ్, రేవంత్‌రెడ్డితో పోటీపడి మరీ ఆస్తులు వెనకేసుకుంటున్నారన్నారు. ఉత్తమ్‌పై సివిల్ సప్లయీస్ అవినీతి కేసు నడుస్తోందని, ఇప్పుడు చేస్తున్న అవినీతి దందాను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రోడ్లు వేస్తామని శంకుస్ధాపనలు చేసి సంవత్సరం దాటినా ఇంకా మొదలు పెట్టలేదన్నారు. కాళేశ్వరం కూలితే రెండు లక్షల కోట్ల ధాన్యం ఎలా పండించారన్నారు. రాష్ట్రంలో స్ధానిక సంస్థల ఎన్నికలు జరిగితే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలకు తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు డా. కేఎల్ఎన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ బాణోతు జగన్నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, నేరేడుచర్ల మండల అధ్యక్షుడు అరిబండి సురేష్‌బాబు, ఇస్లావత్ బాలాజీనాయక్, కోలాహలం లక్ష్మీనరసింహరాజు, కోటానాయక్, చెన్నబోయిన సైదులు, ఇరిగెల వెంకటరెడ్డి, గ్రంథాలయం చైర్మన్ భద్రంరాజు రామారావు, సాముల పుల్లారెడ్డి, పఠాన్ హఫీజ్‌ఖాన్, ఎల్లావుల నాగయ్య, జాల కిరణ్‌యాదవ్, గుండెపంగు నరేష్ తదితరులు పాల్గొన్నారు.