రాజకీయ పార్టీలకు అతీతంగా ఇప్పుడు అందరి దృష్టి ఈ నెల 27న వరంగల్‌లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభపైనే కేంద్రీకృతమైందనడంలో సందేహం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా గత పక్షం రోజులుగా ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల ఆవిర్భావ పండుగ సందడే కనిపిస్తున్నది. జిల్లా స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులంతా సభకు విస్తృత ప్రచారం కల్పించేందుకు అనేక రూపాల్లో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు, విద్యార్థి, యువజన నేతల పాదయాత్రలు, వాల్ రైటింగ్స్, వాల్ పోస్టర్లు, సోషల్‌మీడియా వేదికగా ఉద్యమ ఘట్టాలు, అధినేత కేసీఆర్ విశిష్టతను వివరించేలా పోస్టులు.. ఇలా అనేక రూపాల్లో వరంగల్ సభ ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తున్నారు. దీంతో ప్రజలు కూడా రజతోత్సవ సభపైనే ఒక రకమైన ఆసక్తితో కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా వరంగల్ సభపైనే చర్చోపచర్చలు సాగుతుండడం విశేషం.
– నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్18(నమస్తే తెలంగాణ)
2001 ఏప్రిల్ 27న కేసీఆర్ సారథ్యంలో ఉద్యమ పార్టీగా అవతరించి, తెలంగాణ సాధించిన పార్టీగా అధికారంలోకి వచ్చి, రాష్ర్టాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దిన పార్టీగా బీఆర్ఎస్ తన 25 ఏండ్ల ఆవిర్భావ సభకు సన్నద్ధం అవుతున్నది. పార్టీ యావత్తు గత కొద్ది రోజులుగా దీనిపైనే కేంద్రీకరించి ప్రజలందరి పండుగగా భావిస్తూ కార్యరంగంలోకి దిగింది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలి వార్షికోత్సవ సభకు వేదికగా నిలిచిన నల్లగొండ గడ్డ సైతం ఉద్యమకాలంలో అనేక కీలక ఘట్టాలకు వేదికగా నిలిచింది. ఎందరో ఉద్యమకారులు ఇక్కడి నుంచి కేసీఆర్ పిలుపునందుకుని ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అడుగుపెట్టి కీలక నేతలుగా ఎదిగిన విషయం తెలిసిందే. అందుకే నల్లగొండ జిల్లా గులాబీల ఖిల్లా అన్నట్లుగా 2018-2023 మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ 12కు 12 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరేసి జిల్లా రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసింది. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలో సుమారు 6లక్షలకు పైగా సభ్యత్వంతో బీఆర్ఎస్ పార్టీ అత్యంత పటిష్టవంతంగా రూపుదిద్దుకుంది. అట్లాంటి పార్టీ ఈ నెల 27న వరంగల్ వేదికగా జరుపుకోనున్న రజతోత్సవ బహిరంగసభలోనూ కీలక పాత్ర పోషించేలా సన్నద్ధమవుతున్నది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి జిల్లా కీలక నేతలంతా గత పక్షం రోజులుగా పార్టీ రజతోత్సవం సన్నద్ధంలోనే నిమగ్నమయ్యారు. ఈ నెల 5న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ అయ్యి దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి అత్యధికంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, సామాన్యులు సైతం తరలివచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జనసమీకరణ టార్గెట్లు నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జడ్పీ చైర్మన్లు, ఇతర కీలక నేతలంతా రంగంలోకి దిగారు.
ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇప్పటికే పార్టీ ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు ముగిశాయి. తర్వాత దశలో మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అవి కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. అయితే ఈ సమావేశాలకు పార్టీ శ్రేణుల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన లభిస్తున్నది. ముఖ్యంగా ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సాగునీరు లేక పంటల ఎండడం, ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా సాగకపోవడం, రుణమాఫీ సగంలోని ఆగిపోవడం, రైతుబంధు పూర్తికాక పోవడం, ఆరు గ్యారెంటీల అమలుతోపాటు ఏ పథకం కూడా ఆచరణలోకి రాకపోవడంతో ప్రజల్లో తీవ్ర నిరాశ నెలకొంది. వీటిన్నింటి నేపథ్యంలో మళ్లీ ఎక్కడ చూసినా కేసీఆర్‌ను, ఆయన పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్న సందర్భాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్ నేతల్లో తిరిగి ఉత్తేజాన్ని నింపుతున్నాయి. భవిష్యత్తు మనదేనన్న ఆశాభావంతో ముందుకు సాగుతూ పార్టీ ఆవిర్భావ సభకు భారీగా తరలివెళ్లేందుకు సన్నద్ధం అవుతుండడం విశేషం. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం మేరకు సామాన్యులు సైతం స్వచ్ఛందంగా వరంగల్ సభకు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పుడు ఇలా తరలివచ్చే వారికి వాహన సదుపాయం కల్పించడం పార్టీ నేతలకు సవాలుగా మారింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులతోపాటు అందుబాటులో ఉన్న అన్ని రకాల ప్రైవేటు వాహనాలను బుక్ చేశారు. సొంత వాహనాలు ఉన్న వారూ వాటిల్లోనే వచ్చేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో ఈ నెల 27వ తేదీన బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా నుంచి లక్ష మందికి పైగా తరలివెళ్లనున్నట్లు అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే గ్రామ స్థాయి వరకు వరంగల్ సభకు విస్తృత ప్రచారం కల్పించేలా వాల్ రైటింగ్స్ చేపట్టారు. పట్టణాల్లో అన్ని ముఖ్య కూడళ్లతో పాటు మండల కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. దీంతో పాటు వాల్ పోస్టర్లతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణాలు, గ్రామాలతోపాటు ప్రైవేటు వాహనాలకు వాల్ పోస్టర్లు అంటిస్తున్నారు. ఇక మరోవైపు పాదయాత్రలతోనూ విద్యార్థి, యువజన నేతలు సందడి చేస్తున్నారు. భువనగిరి మండలం రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. బీఆర్‌ఎస్వీతోపాటు యువనేతలతో కూడిన ఓ బృందం వలిగొండ మండలం వేములకొండ గుట్ట నుంచి యాదగిరిగుట్ట వరకు మూడు రోజులపాటు గ్రామాల్లో ప్రచారం చేసుకుంటూ పాదయాత్రను చేపట్టారు. అర్వపల్లి నుంచి సభా స్థలి వరకు త్వరలో 25మందితో కూడిన ఓ బృందం సైకిల్ యాత్రగా బయల్దేరేందుకు ఏర్పాట్లు చేస్తుకుంటున్నారు. ఇలా అనేక రూపాల్లో వరంగల్ సభకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల్లో కూడా సభపై అమితాసక్తి కనిపిస్తున్నది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలంతా కలిసికట్టుగా ముందుకు సాగుతూ వరంగల్ సభలో ఉమ్మడి జిల్లా సత్తా చాటేంందుకు సన్నద్ధమవుతుండడం విశేషం.