బొమ్మలరామారం, ఏప్రిల్ 20 : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపింది బీఆర్ఎస్ పార్టీ అని, పదేండ్ల కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలకు ప్రజలకు మేలు జరిగిందని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఆదివారం బొమ్మలరామారం మండలంలోని యావాపూర్‌లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో సుఖ సంతోషాలతో ఉన్న రైతులు, చేతి వృత్తుల వారు నేడు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిందని తెలిపారు. హామీలు అమలు చేయడానికి నిధులు లేవని చెప్పడం పాలన చేతగానితనమేనని విమర్శించారు.
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రణాళికలు రచించాలని సూచించారు. రజతోత్సవ సభకు ఆలేరు నియోజక వర్గం నుంచి అభిమానులు, ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సభ ద్వారా కేసీఆర్ రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్ గౌడ్, మాజీ ఎంపీపీ సుధీర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ గుర్రాల లక్ష్మారెడ్డి, మాజీ భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కుషంగల సత్యనారాయణ, మాజీ పీఏసీఎస్ చైర్మన్ గూదె బాల నర్సింమ, కొండోజు ఆంజనేయులు, బాల్ సింగ్, బీరప్ప తదితరులు పాల్గొన్నారు.