చివ్వెంల, ఏప్రిల్ 26 : ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల యువజన విభాగం ఉపాధ్యక్షుడు భూక్య నాగూనాయక్ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని మొగ్గయ్యగూడెంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన గతి తప్పిందన్నారు. హైడ్రా పేరుతో పేద ప్రజల జీవితాలు నాశనం చేసి, ప్రభుత్వ భూముల అమ్మకాల పేరుతో రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నట్లు తెలిపారు. రైతు రుణమాఫీ, పెన్షన్ల రెట్టింపు తదితర హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూ వారికి అండగా ఉంటుందన్నారు. ఈ రజతోత్సవ మహాసభ ద్వారా పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రజల మధ్యలో ఉంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతు వారికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పలయ్య, భూక్య వెంకన్న, సిగ శ్రీను, అంజయ్య, చిన్న వాల్యా, వెంకట్ నర్సు, బ్రహ్మచారి, లక్ష్మి, ముత్తమ్మ పాల్గొన్నారు.