మిర్యాలగూడ, ఏప్రిల్ 26: బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సభకు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో తరలి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సబ్బండవర్గాల అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ కృషి చేశారని అన్నారు. దామరచర్లలో దేశానికే తలమానికమైన 4వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించినట్లు తెలిపారు. రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి 256 కార్లు, 47 స్కూల్ బస్సులు, 20 ఆర్టీసీ బస్సుల్లో మొత్తం 4170 మంది తరలివెళ్లనున్నట్లు తెలిపారు. దాంతో పాటు చాలా మంది సొంత వాహనాల్లో వస్తున్నారని పేర్కొన్నారు.
నకిరేకల్ : నేడు వరంగల్‌లో జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు విద్యార్థిలోకం అధికంగా తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి గోలి శివప్రసన్న కుమార్ పిలుపునిచ్చారు. నకిరేకల్ పట్టణంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రజతోత్సవ సభకు బీఆర్ఎస్వీ నాయకులు, విద్యార్థులు, అభిమానులు రావాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కొండ గణేశ్, కృష్ణ, ప్రసాద్, రాములు, సాయి, సైదులు, వెంకటేశ్ పాల్గొన్నారు.
నిడమనూరు : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నేడు జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ దండు కదం తొక్కాలని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామర్ల జానయ్య పిలుపునిచ్చారు. శనివారం ఆయన నిడమనూరు, త్రిపురారం మండలాల్లో రజతోత్సవ సభ విజయవంతానికి విస్తృత ప్రచారం చేశారు. రజతోత్సవ సభలో ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలను అధినేత కేసీఆర్ ఎండగట్టనుండటంతో రైతులు, యువకులు, మహిళలు సభకు తరలివెళ్లేందుకు సిద్దమయ్యారని పేర్కొన్నారు.
మర్రిగూడ : వరంగల్‌లో ఆదివారం నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లాలని పార్టీ సీనీయర్ నాయకుడు సంగెపు గిరినేత పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని సరంపేట ఎక్స్ రోడ్డు వద్ద విలేకరులతో మాట్లాడారు. పార్టీ రజతోత్సవం సందర్భంగా గ్రామాల్లో పార్టీ జెండాలను ఎగుర వేయాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
నకిరేకల్ : బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలువేరు ప్రభాకర్ శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు, అభిమానులు బీఆర్ఎస్ సభకు తరలిరావాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలోనే కార్మికులకు న్యాయం జరిగిందని, అందుకే కార్మికులంతా కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
కట్టంగూర్ : బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి గోలి శివప్రసన్నకుమార్ శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. సభకు విద్యార్థులు, రైతులు అధిక సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో సభ్యత్వ నమోదుతో పాటు బీఆర్ఎస్వీ కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
నల్లగొండ రూరల్, ఏప్రిల్ 26 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గ్రామాల్లో అధికార పార్టీ అరాచకాలను భరించ లేక ఆ పార్టీకి చెందిన యువత బీఆర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ 50 కుటుంబాలు నల్లగొండలోని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కంచర్ల మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, మాయమాటలతో మోసం చేసిందని, ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రనికి శ్రీరామ రక్ష అని భావిస్తూ స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన కాంగ్రెస్ యువ నాయకులు చెందిన ఆర్. శివకుమార్, రుద్రాక్షి సాయి, రుద్రాక్ష స్వామి, ఆర్. కుమార్ మాట్లాడుతూ పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే బీఆర్ఎస్లో చేరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, గాదె రాంరెడ్డి, మాజీ జడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, బడుపుల శంకర్, మామిళ్ల సైదులు, కోట్ల జపాల్రెడ్డి, మునుపాటి మహేశ్, కడారి వెంకన్న, సుంకరబోయిన వెంకన్న, మేడ సైదులు, చెరుకు శ్రీకాంత్, రాజేశ్, ఆంజనేయులు, చిన్న శివ, జయంత్, శ్రీకాంత్, ధోని, ఎల్లేశ్ పాల్గొన్నారు.
హాలియా, ఏప్రిల్ 22 : వరంగల్‌లో నేడు జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు పార్టీ నాయకులు, అభిమానులు ఉద్యమ స్ఫూర్తితో తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం హాలియాలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అవస్థల పాలు చేస్తుందన్నారు. ప్రజలకిచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. రుణమాఫీ కాక, రైతుబంధు అందక, సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలయ్యారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారన్నారు. తూశాడని అన్నారు. అందుకే ప్రజలంతా తిరిగి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పాలన రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఓరుగల్లు సభకు నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి కదలివెళ్లే బీఆర్ఎస్ దండును చూసి కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు యడవల్లి మహేందర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు వడ్డె సతీశ్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, యూత్ అధ్యక్షుడు సైదాచారి, నాయకులు సురభి రాంబాబు, గడ్డం రమణ, కళ్యాణి, దుండిగల్ల శ్రీను, ఎల్లయ్య పాల్గొన్నారు.
నకిరేకల్, ఏప్రిల్ 26 : బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని, కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు తెలంగాణ వ్యాప్తంగా పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున సభకు తరలి వస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం పల్లెలు, పట్టణాలు, కాలనీల్లో పార్టీ బాధ్యులు గులాబీ జెండాలను ఎగురవేసిన తర్వాత వరంగల్ సభకు తరలిరావాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 16 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. అందుకే ఓడిపోతామనే భయంతో సీఎం రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. వరంగల్ సభతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమన్నారు. వరంగల్ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్ పల్లె విజయ్, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేశ్, రాచకొండ వెంకట్‌గౌడ్, మాజీ సర్పంచ్ చెట్టిపల్లి జానయ్య, నాయకులు పాల్గొన్నారు.
చిట్యాల : పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ శనివారం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరాడు. మాజీ ఎమ్మెల్యే ఆయనకు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, బీఆర్ఎస్ చిట్యాల అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, ఆగు అశోక్, జిట్ట శేఖర్, ఆవుల ఆనంద్ పాల్గొన్నారు.