యాదగిరిగుట్ట, డిసెంబర్ 13: గ్రామ పంచాయతీ తొలి విడత పోలింగ్‌లో గులాబీ జెండాకు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు. మారుమూల గ్రామాల్లోని ఓటర్లు సైతం కేసీఆర్‌కే జై కొట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు, భయభ్రాంతులకు గురి చేసినా ఓటర్లు మాత్రం గులాబీ జెండానే ఆదరించారు. పలు పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపు బావుటా ఎగురవేయగా, మరికొన్ని గ్రామాల్లో గట్టి పోటీఇచ్చి సింగిల్ డిజిట్‌తో ఓటమి పాలై ఓటర్ల ఆదరణను గెలుచుకున్నారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్వయంగా బరిలోకి దిగి ఓటర్లకు ఫోన్లు చేసి మరీ ఓటు వేయాలని డిమాండ్ చేయడంతోపాటు ఓటు వేయకుంటే తాటతీస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
మాజీ ప్రభుత్వ విప్ గొం గిడి సునీత, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి పార్టీ అభ్యర్థి వీక్‌గా ఉన్న గ్రామాలకు వెళ్లి ప్రచారం నిర్వహించి ఓటుశాతం పెంచే పనిలో దాదాపుగా సఫలమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, ఆత్మకూరు(ఎం), బొమ్మలరామారం, రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో 11న పోలింగ్ జరిగింది. 6 మండలాల్లో కలుపుకుని 155552 ఓట్లకు 144483 ఓట్లు పోల్ కాగా ఇందు లో 5518 నోటా, చెల్లని ఓట్లు పోగా 54,233 ఓటర్లు బీఆర్ఎస్ అభ్యర్థి వైపే నిలిచారు.
కాంగ్రెస్ అధికారంలోఉంది కదా అని కొంత వెనుకడుగు వేసి నా బీఆర్ఎస్ అభ్యర్థులను మాత్రం మరువలేదు. ఓ ఇంట్లో 6 ఓట్లు ఉంటే సగం ఓట్లు బీఆర్ఎస్కే వేసినట్లు పోలైన ఓట్లను చూస్తే కనిపించింది. 6 మండలాలకు చెందిన 39.02 శాతం ఓటర్లు బీఆర్ఎస్కే జై కొట్టారు. మొత్తం 155552 ఓట్లకు 138965 ఓట్లు పోల్ కాగా ఇందులో 5,518 ఓట్లు నోటా, చెల్లనివి ఓట్లుగా పరిగణించగా 54,233 మంది ఓటర్లు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులకే ఓటు వేశారు. 6 మండలాల్లో 153 గ్రామ పంచాయతీలకు 16 ఏకగ్రీవాలు కాగా ఇందులో 137 బీఆర్ఎస్ తరఫు సర్పంచులు ఏకగ్రీవంగా గెలిచారు.
ఇక పోటీలో ఉన్న 137 గ్రామ పంచాయతీలు, ఏకగ్రీవమైన పంచాయతీలకు కలుపుకుని 58 (39శాతం) సర్పంచ్‌లు బీఆర్ఎస్ తరఫు సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. మిగతా 85 గ్రామాల్లో పోటాపోటీగా నిలిచారు. పలు గ్రామాల్లో కేవలం 4 నుంచి 10 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 152 ఉప సర్పంచ్‌లకు 66(43.42శాతం) ఉప సర్పంచ్ పదవులను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. మొత్తంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టిపోటి ఇచ్చారు. ఓటర్లు సైతం అధికార పార్టీ ప్రలోభాలకు, డబ్బులకు లొంగకుండా మొక్కవోని సంకల్పంతో బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించారు.
అధికారం మనదే కదా అన్న ఉద్దేశంతో తొలివిడత పోలింగ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెగించాడు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు ఓట్లు వేయించేందుకు స్వయంగా రంగంలోకి దిగి ఫోన్ల ద్వారా ఓటు వేయాల్సిందేనని లేకపోతే మీ అంతు చూస్తానంటూ భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. తన సొంత గ్రామమైన సైదాపురంలో బహిరంగగానే ఓటర్లను హెచ్చరించారు.. నేను ఎమ్మెల్యేను..అధికారం నాచేతులో ఉంది.. ఎవరికి ఓటేస్తారో నాకు తెలుస్తది.. పోలింగ్ డబ్బాలో చూస్తా అంటూ బెదిరించారు. సర్పంచులు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క ఓటు బీఆర్ఎస్ అభ్యర్థికి వేసినా నామీద ఒట్టే అంటూ మయమాటలు చెప్పారు. వీరభద్ర స్వామిమీద ఒట్టేసి చెబుతున్నా.., ఒక్కొక్కడి పని చెప్తా, వాళ్ల తాట తీస్తా అంటూ ఆగ్ర హం వ్యక్తం చేశారు.
నాపైనే పోటీకి దిగుతారా.. గుర్తు పెట్టుకోండి, నాగడప తొక్కనియ్యా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇటు పోలీసులు, అటు అధికారులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చినట్లు కనిపించింది. పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మద్యం సీసాలు, డబ్బు సంచులతో పట్టుబడితే వదిలేసిన ఘటనలు ఉన్నాయి. పలు గ్రామా ల్లో పోలీస్ కానిస్టేబుళ్లే మద్యం, డబ్బులు పంపిణీ చేసినట్లు బీఆర్ఎస్కు చెందిన అభ్యర్థులు ఆరోపించారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూంటే పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఉండి ఓటమిపాలైతే అవమానంగా ఉంటది. అభ్యర్థులు డబ్బుల పంపిణీ విషయంలో వెనుకాడొద్దని ఎమ్మెల్యే సర్పంచ్ అభ్యర్థులకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థులు డబ్బులు, మద్యం సీసాలు, బిర్యానీలు ఇంటింటికి పంపిణీ చేశారు. ఒక్కో ఓటుకు రూ.5 నుంచి రూ.10 వేల వరకు ఇచ్చినట్లు సమాచారం.
యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి సర్పంచ్ ఎన్నిక విషషయంలో కౌటింగ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దంపతుల స్వగ్రా మం కాబట్టి సర్పంచ్ అభ్యర్థిని గెలువనివొద్దని కాంగ్రెస్ తొం డి చేసి గెలిచింది. బీఆర్ఎస్ అభ్యర్థి రేపాక మౌనిక గెలుపుదిశ గా పయనించగా చివరి క్షణాల్లో కథ అడ్డం తిరిగింది. గ్రామం లో మొత్తం 12 వార్డులకు బీఆర్ఎస్ బలపర్చిన 8 వార్డులు కైవసం చేసుకున్నారు. అనంతరం జరిగిన సర్పంచ్ పదవి కౌటింగ్ తొలి వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. 9 వార్డుల్లో కౌటింగ్లో 1150 ఓట్ల అధిక్యంలో నిలిచింది. అనంతరం జరిగిన మరో 3 వార్డుల్లో సైతం బీఆర్ఎస్ అభ్యర్థి మౌనిక ముందంజలో ఉండటంతో గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు సంబురాల్లో మునిగిపోయారు.
ఒక దశలో టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి సొంత గ్రామం కావడంతో ఆయనను కార్యకర్తలు భుజం మీద మోసుకుంటూ ర్యాలీ సైతం చేపట్టారు. అనంతరం జరిగిన మిగతా 3 వార్డుల్లో జరిగిన కౌంటింగ్‌లో మౌనిక వెనుకపడటంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అవాక్కయ్యారు. దీంతో కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. చివరకు బీఆర్ఎస్ అభ్యర్థికి 1114 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 1133 ఓట్లు వచ్చి 19 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సుమారు 8 వార్డుల్లో మెజార్టీతో నిలిచిన అభ్యర్థి చివరి 4 వార్డుల్లో వెనుకపడటమేమిటని నిరాశ చెం దారు. కేవలం మూడు వార్డుల్లో ఇంత వ్యత్యాసం ఎలా సాధ్యమైందంటూ ఆశ్చర్యపోయారు. దీనిపై త్వరలో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు తెలిపారు.