హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆయా కంపెనీల యాజమాన్యాలను డిమాండ్ చేశారు. గురువారం ఆయన గుండ్లపోచంపల్లిలోని మయూర ఇండియా మల్టీ నేషనల్ కంపెనీ బీఆర్టీయూ(భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆ పరిశ్రమ వద్ద యూనియన్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కంపెనీని సందర్శించి యాజమాన్యంతో మాట్లాడారు. కార్మికుల సమస్యలపై చర్చించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికుల జీతభత్యాలు, వారిసంక్షేమం, ఇతర ప్రయోజనాలపై ప్రభుత్వాలు, యాజమాన్యాలు సానుకూలంగా ఉండాలని సూచించారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను హరించేలా ఉన్నాయని విమర్శించారు. వాటిని పరిశీలించి కార్మిక సంక్షేమానికి అనుగుణంగా మార్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజయ్య, సలహాదారు సత్యప్రసాద్, ప్రధాన కార్యదర్శి జే సంతోష్‌కుమార్, జాయింట్ సెక్రటరీ మహేశ్, కే మధుసూదన్‌రెడ్డి, బీ శ్రీనివాస్, జే వెంకట్రావు, దిలేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.