నల్లగొండ ప్రతినిధి, మార్చి13(నమస్తే తెలంగాణ) : నల్లగొండ ప్రతినిధి, మార్చి13(నమస్తే తెలంగాణ) : గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చలో భాగంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తరఫున మాట్లాడేందుకు సిద్ధమైన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిపై బడ్జెట్ సమావేశాల సెషన్ నుంచి సస్పెన్షన్ వేటు వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రజల పక్షాన, రైతులు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీస్తే సస్పెండ్ చేస్తారా అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
టీవీలు, సామాజిక మాధ్యమాల్లో జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తీవ్రంగా స్పందించారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. నల్లబ్యాడ్జీలు ధరించి నల్లజెండాలతో నిరసన తెలిపారు. రాస్తారోకోలతో ట్రాఫిక్‌ను స్తంభింపచేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం… దోపిడి రాజ్యం.. దొంగల రాజ్యం.. సీఎం రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
మరోవైపు ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, నిరసనలు వ్యక్తం చేయడాన్ని కూడా సహించలేని పరిస్థితుల్లో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు క్లాక్‌టవర్ సెంటర్లో ఆందోళనకు దిగారు. నల్ల జెండాలు, బ్యాడ్జీలతో ర్యాలీ తీసి, రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడానికి సిద్ధం కాగా, పోలీసులు వచ్చి దిష్టిబొమ్మను లాక్కుపోయేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
దాంతో పోలీసులు, బీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట, వాగ్వివాదం జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. అయినా బీఆర్ఎస్ నేతలు దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ అనైతికమని, ప్రభుత్వ కుట్ర పూరిత చర్యలను ప్రజల్లో ఎండగడతామని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి హెచ్చరించారు. హాలియాలో బీఆర్ఎస్ నేతలు ర్యాలీ తీసి, సాగర్ క్రాస్‌రోడ్స్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సూర్యాపేట జిల్లాలో…
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జగదీశ్‌రెడ్డి సస్పెన్సన్‌పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా స్పందించారు. విషయం తెలిసిన వెంటనే పార్టీ నేతలు, కార్యకర్తలంతా రోడ్లపైకి వచ్చారు. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడంలో ముందుండే జగదీశ్‌రెడ్డిపై సభ నుంచి సస్పెన్షన్ అనేది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్రావు అన్నారు. జగదీశ్‌రెడ్డి స్వగ్రామం నాగారం మండలం కేంద్రంలోనూ బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అర్వపల్లి, తుంగతుర్తి మండల కేంద్రంలోనూ బీఆర్ఎస్ నేతలంతా రోడ్లపైకి వచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను ఊరేగించి, దహనం చేశారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోనూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
నేడూ ఆందోళనలు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సస్పెన్సన్‌పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం రాష్ట్రమంతా అన్ని నియోజకవర్గ కేంద్రా ల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు గురువారం సాయంత్రం నుంచే పలుచోట్ల నిరసనలకు దిగారు. మిగతా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన లు చేపట్టేందుకు సన్నద్ధమయ్యారు. ప్ర జల పక్షాన ప్రశ్నిస్తే సభ నుంచి సస్పెండ్ చేస్తారా? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తూ నేడు ఉమ్మడి జిల్లా అంతటా ర్యాలీలు, రాస్తారోకోలు, ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలకు సిద్ధమయ్యారు.
సస్పెన్షన్‌తో గొంతు నొక్కలేరు..
మరింత బలంగా ప్రజల వాణి వినిపిస్తా
“ఇన్నేండ్లు సభ్యుడిగా ఉన్న నేను శాసనసభలో ఒక్క రోజు కూడా అన్‌పార్లమెంటరీ పదం వాడలేదు. ఇతరులను కించపరిచే విధంగా గానీ, సభ గౌరవాన్ని తగ్గించే విధంగా గానీ మాట్లాడలేదు. ప్రత్యేకించి స్పీకర్ అధికారాలు, విధులుతెలిసిన సభ్యుడిగా ఎక్కడా స్పీకర్ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించలేదు. ఇది కేవలం ప్రభుత్వం చేసిన కుట్ర. రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలు, రైతుల వెతల గురించి, వివిధ వర్గాల ప్రజల సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత మాపై ఉంది. ప్రజలు చాలా ఆక్రోషంగా ఉన్నారు. నా ప్రసంగంలో ఎక్కడా ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. స్పీకర్‌ను కించ పరిచే మాట లేదు. ఈ సభ అందరిదీ. అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఈ సభ పెద్దగా మీకు ఆ బాధ్యత ఉంది. మమ్మల్ని మాత్రమే అనొద్దు. అవతలి వాళ్ల(అధికార పక్షం)ను కూడా కంట్రోల్ చేయాలని కోరాను.
అయినా కుట్రలతో సన్సెన్షన్ విధించారు. దళితుల పట్ల కమిట్మెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే… నా సూర్యాపేట మున్సిపాలిటీ జనరల్ స్థానంలో ఎస్సీ మహిళకు చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పిస్తే అద్భుతంగా పని చేశారు. నాలుగేండ్ల తర్వాత ఆ దళిత చైర్‌పర్సన్‌ను దించేందుకు కాంగ్రెస్ వాళ్లు చేసిన కుట్రలను తిప్పి కొడుతూ ఆమె పదవిని నిలబెట్టాను. దళితుల పట్ల నా నిబద్ధత అది. ఇవ్వాల ఈ ప్రభుత్వం తాను చేసే తప్పును కప్పిపుచ్చుకునేందుకు, కమీషన్ల దందాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మొదటి రోజే సభలో ఏదో ఒకటి చేయాలని ఉద్దేశపూర్వకంగా వ్యవహరించింది. అందులో భాగమే నా సస్సన్సెన్. సస్పెన్షన్‌తో నన్ను భయపెట్టించలేరు. కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలి ఇక్కడి దాకా వచ్చిన. ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలు ఎదుర్కొని వచ్చిన వాణ్ని. నా గొంతు నొక్కలేరు. ఇంకా బలంగా, ప్రజల పక్షాన నా గొంతు వినిపిస్తా’
– మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
ప్రశ్నించే గొంతుకను నొక్కడమే
‘మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం అంటే ప్రశ్నించే గొంతుకను నొక్కే ప్రయత్నమే, అసెంబ్లీ సమావేశాల్లో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతున్నప్పుడు అనేక సార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుకొని ఇబ్బంది పెట్టారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నారనే సస్పెండ్ చేసినట్లు స్పష్టంగా కనిసిస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఉన్న ఏకైక ఎమ్మెల్యేను సస్పెండ్ చేయడం అధికార పార్టీ దురహంకారాన్ని సూచిస్తుంది.’
– గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
కుట్ర పూరితంగా జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్
‘మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు కుట్రలో భాగమే సస్పెన్షన్ అని భావిస్తున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకులను టార్గెట్ చేసి గొంతు నొక్కే విధంగా కాంగ్రెస్ పాలన ఉంది. అసెంబ్లీలో స్పీకర్‌పై ఎలాంటి వ్యాఖ్యలూ చేయని జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడం మంచి సంస్కృతి దు.’
-బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే