తుంగతుర్తి, జులై 09 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మెయిన్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పోర్లు దండాలతో నిరసన వ్యక్తం చేశారు. తుంగతుర్తి మండల కేంద్రానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డు వెడల్పు, డివైడర్, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసే విధంగా పని మంజూరి చేసి, టెండర్ ప్రక్రియ పూర్తి చేసి శంకుస్థాపన చేసినట్లు ఆ పార్టీ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య తెలిపారు. మంజూరు చేసిన రోడ్డు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రారంభించక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండాగాని రాములుగౌడ్, గాజుల యాదగిరి, మండల నాయకులు గోపగాని రమేశ్, తడకమల్ల రవికుమార్, కడారి దాసు, గుడిపాటి వీరయ్య, మాజీ సర్పంచులు కొండగడుపుల నాగయ్య, వీరోజీ, రాములు నాయక్, మల్లెపాక రాములు, సోమేశ్, గోపగాని వెంకన్న, మధు మల్లేశ్, సాయికిరణ్, మల్లికార్జున్, వెంకటేశ్ పాల్గొన్నారు.