సూర్యాపేట, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయకపోవడాన్ని నిరసిస్తూ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు దిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో రైతులతో కలిసి ధర్నాకు దిగింది. రైతులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వివిధ రూపాల్లో నిరసన తెలుపుతూ కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన ధర్నాలు సాయంత్రం మూడు గంటల వరకు సాగాయి. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ వద్ద చేపట్టిన ధర్నాలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బూడి భిక్షమయ్యగౌడ్ పాల్గొన్నారు. భువనగిరి ధర్నాలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో మాజీ ఎమ్మెలే గాదరి కిశోర్, కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఒంటెద్దు నర్సింహారెడ్డి, నల్లగొండ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, నాగార్జునసాగర్‌లో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్, ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు, దేవరకొండలో బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పెద్దఎత్తున ధర్నాలు చేశారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆర్డీఓ, తాసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందించారు. సర్కారు రుణమాఫీ చెయ్యకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.