భువనగిరి అర్బన్, సెప్టంబర్ 1: ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం మీద కుట్రలు చేస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ భువనగిరి, ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి కాళేశ్వరం నీటిని తెచ్చి తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం చేశారు.
అనంతరం భువనగిరిలోని బాబూ జగ్జీవన్‌రామ్ చౌరస్తాలో ధర్నా నిర్వహించి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ అపర భగీరథుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మెట్ట భూముల్లో గోదావరి నీళ్లను పారించడంతో బస్వాపూర్ రిజర్వాయర్ కింది భూములు పచ్చని కోనసీమగా మారాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కాళేశ్వరం పేరుపై కాలయాపన చేస్తోందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒరిగేదేమీలేదన్నారు.
జనం దృష్టి మళ్లించేందుకే..
కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమ లు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లిస్తోందని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకపోవడం తో వారు ప్రశ్నిస్తున్నారని, దీంతో ఏం చేయాలో దిక్కుతోచక కాళేశ్వరం కేసును సీబీఐకి ఇవ్వాలని కొత్త డ్రామాకు తెరతీశారన్నారు.
బీజేపీ డైరెక్షన్లో పనిచేస్తున్న రేవంత్..
అసెంబ్లీలో హరీశ్‌రావును మాట్లాడించకుండా కాళేశ్వరం కేసును సీబీఐకి ఇచ్చారంటేనే రేవంత్ బీజేపీ డైరెక్షన్లో పనిచేస్తున్నాడని అర్థమవుతోందని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కాళేశ్వరం నీటిని రైతాంగానికి ఇచ్చినందుకు సీబీఐకి ఇచ్చారా… పంటలు పండించుకుంటూ రైతుల కండ్లలో ఆనందం కనపడినందుకు సీబీఐకి ఇచ్చారో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న నాటకాలు..
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అసత్య ఆరోపణలతో నాటకాలు ఆడుతున్నాయ ని తేలిపోయిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర కోసం, తెలంగాణ రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఆ రెండు పార్టీలు మతిభ్రమించి మాట్లాడుతున్నాయని అన్నారు.
అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్..
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అభివృద్ధిని పట్టించుకోకుండా కాళేశ్వరం పేరుతో కొత్తనాటకానికి తేరలేపిందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు అన్నారు. సీబీఐ విచారణకు బీఆర్ఎస్ భయపడేది లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, మాజీ జడ్పీటీసీలు బీరు మల్ల య్య, అనురాధ, పార్టీ పట్టణ, మండల అధ్యక్షు డు ఏవి.కిరణ్‌కుమార్, జనగాం పాండు, ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నీల ఓంప్రకాశ్‌గౌడ్, ర్యాకల శ్రీనివాస్, ఇట్టబోయిన గోపాల్, జడల యశీల్గౌడ్, అంజద్, పెంట నితీన్, కుతా డి సురేశ్, నాగరాం సూరజ్, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు.