నల్లగొండ ప్రతినిధి/ సూర్యాపేట, డిసెంబర్17 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టీకానికి గురైన లగచర్ల రైతులకు అండగా ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కాయి. వారిపై అక్రమంగా కేసులు పెట్టి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి, జైలులో నిర్బంధిచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం వినూత్నరీతిలో నిరసనకు దిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలతోపాటు పలు మండలాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఎక్కడికక్కడ వినతిపత్రాలు సమర్పించాయి.
లగచర్ల రైతులపై అక్రమ కేసులను ఎత్తివేస్తూ వెంటనే జైళ్ల నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. దేవరకొండలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కదిలారు. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. మిర్యాలగూడలో మాజీ ఎమ్మె ల్యే నల్లమోతు భాస్కర్‌రావు నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డితోపాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నేతలంతా పాల్గొన్నారు. డీఈఓ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లగచర్ల రైతులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
నకిరేకల్ మెయిన్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేతృత్వంలో జరిగిన నిరసనలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున భాగస్వాములు అయ్యారు. ‘రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి.. లగచర్ల రైతులను భేషరుతుగా విడుదల చేయాలి’ అంటూ నినదిస్తూ బాబాసాహెబ్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. చౌటుప్పల్‌లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమానికి తరలివచ్చారు. ‘రైతులకు బేడీలు సిగ్గు సిగ్గు’ అంటూ నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఆలేరులో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలంతా అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
అనంతరం స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. భువనగిరి అంబేద్క ర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగింది. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మునుగోడు, చండూరు, మర్రిగూడెం, త్రిపురారం, హాలియా మండలాల్లోనూ స్థానిక నేతలు అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. సూ ర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
లగచర్ల రైతులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకుని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రాల్లోనూ భారీ ఎత్తున పార్టీ శ్రేణులు నిరసన తెలిపా యి. గరిడేపల్లి మండలం కీతవారిగూడెం, నడిగూడెం, మోతె, తుంగతుర్తి మండలం గానుగబండలోనూ అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో లగచర్ల రైతులకు అండగా కదం తొక్కారు. యాదగిరిగుట్ట, తుర్కపల్లి, వలిగొండ, భూదాన్ పోచంపల్లి, అడ్డగూడూరు, గుండాల మండలం వెల్మజాల, ఆత్మకూర్(ఎం), రాజపేట మండలాల్లోనూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. లగచర్ల రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని, మానవీయ కోణంలో వారందరినీ బేషరతుగా జైలులో నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చర్యలను మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.