దేవరకొండరూరల్(దేవరకొండ)మే31 : బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసన సభ్యుడు రమావత్వ్రీంద్రకుమార్ కోరారు. దేవరకొండలోని తన నివాసంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. జూన్1, 2, 3 తేదీల్లో 3 రోజులపాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కొత్తగా వచ్చిన రేవంత్రెడ్డి సర్కారు మొండిగా వ్యవహరిస్తున్నదని, గత పదేండ్లలో జరిగిన మంచిని, అభివృద్ధిని పట్టించు కోకుండా, రాజకీయ దరుద్దేశంతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నదని, తెలంగాణ అనగానే హైదరాబాద్, వరంగల్ గుర్తుకొస్తాయని, రాష్ట్ర రాజముద్ర నుంచి చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు కూడా దీనిని తీవ్రంగా వ్యతిరేకిసున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయాన్ని విరమించుకోకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతామని హెచ్చరించారు.