– కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, జనవరి 12 : కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన 2023లో నిర్మించిన 560 డబుల్ బెడ్రూం ఇండ్లకు మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అప్పగించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. సోమవారం వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ సూర్యనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ పర్యవేక్షణలో ఆర్డీఓ నేతృత్వంలో సీసీ కెమెరాల మధ్య 560 మంది లబ్ధిదారులను నిష్పక్షపాతంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. దీంతో పాటు ఇండ్ల సమీపంలో హెల్త్ సెంటర్, మిషన్ భగీరథ పైప్లైన్లు కూడా వేయించామని, ఇక ఇండ్లకు విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయించాల్సిన పరిస్థితిలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌తో గృహ ప్రవేశాలు నిలిచిపోయాయన్నారు.
రూ.50 లక్షలతో ఇండ్లకు విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ కల్పిస్తే నిరుపేద లబ్ధిదారులు గృహ ప్రవేశం చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ మౌలిక వసతులు కల్పించకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలను వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్న మంత్రి ఉత్తమ్ పద్మావతి దంపతులు రూ.50 లక్షలు కేటాయించకపోవడం లబ్ధిదారులపై వారికున్న వివక్షను స్పష్టం చేస్తుందని విమర్శించారు. ఇలా ఇంకా కొంత కాలం గడిస్తే నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి ఉందని, తక్షణమే డబుల్ బెడ్రూం ఇళ్లకు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అప్పగించకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామన్నారు.
ఈ అంశంపై కలెక్టర్‌ను కూడా కలుస్తామన్నారు. దీనిపై ఆర్డీఓ సూర్యనారాయణ స్పందిస్తూ.. బాలాజీ నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్టు తెలిపారు. త్వరలో మంజూరైన నిధులతో వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, సీనియర్ నాయకులు పైడిమర్రి సత్యంబాబు, మాజీ కౌన్సిలర్లు మామిడి రామారావు, మేదర లలిత, చింతల నాగేశ్వరరావు, అలవాల వెంకట్, కర్ల సుందర్ బాబు, చీమ శ్రీనివాసరావు, గొర్రె రాజేష్, ఇమ్రాన్, అబ్బు, ఉపేందర్, చలిగంటి వెంకట్, మల్లయ్య గౌడ్, శ్రీనివాస్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Kodada : ‘లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు అప్పగించకపోతే ఉద్యమం మరింత ఉధృతం’