చండూరు, అక్టోబర్ 09 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ చండూరు పట్టణాధ్యక్షుడు కొత్తపాటి సతీశ్ ప్రజలను కోరారు. గురువారం ఆయన స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్షకులు, కార్మికులు ఇతర సబ్బండ వర్గాలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుభిక్షంగా ఉన్న రైతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు రాక, రుణమాఫీ కాక అప్పుల పాలు అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నలకు యూరియా దొరకని పరిస్థితులు దాపురించాయన్నారు. యూరియా కోసం లైన్లలో నిలబడి ఎంతోమంది రైతన్నల ప్రాణాలు గాల్లో కలిసి పోయినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కావున స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించుకుంటే ప్రభుత్వంపై రైతులు, కార్మికులు, కర్షకుల పక్షాన పోరాడుతారని, ప్రజలందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.