కాలీన రాజకీయాల్లో తనదైన వ్యూహాన్ని అమలు చేయడంలో బీఆర్ఎస్ను మించిన రాజకీయ పార్టీ మరొకటి లేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రారంభంలోని టీఆర్ఎస్ పుట్టుక నుంచి నేటి బీఆర్ఎస్ ఆవిర్భావం వరకు ప్రత్యర్థుల అంచనాలకు అందని విధంగా ముందుకు సాగుతున్నది. స్వరాష్ట్రంలో ప్రభుత్వపరంగా అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తూనే… పార్టీ పరంగానూ రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగింది. తిరుగులేని శక్తిగా మారింది.
ఈ ఒరవడికి కొనసాగింపుగా మరోసారి విరామం లేని కార్యాచరణను సిద్ధం చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శనంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వచ్చే మూడు, నాలుగు నెలలకు సంబంధించి ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా కార్యక్రమాల నిర్వహణకు రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. అందులో భాగంగా కార్యక్రమాల సమన్వయానికి జిల్లాల వారీగా కొత్త ఇన్చార్జిలను సైతం సోమవారం ప్రకటించారు.
నల్లగొండకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, సూర్యాపేటకు రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, యాదాద్రిభువనగిరికి ఎమ్మెల్సీ యాదవరెడ్డిని నియమించారు. వారు ఆయా జిల్లాల వారీగా కార్యక్రమాల నిర్వహణపై జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. కార్యక్రమాల షెడ్యూల్‌ను ఖరారు చేసి నిర్వహణపై దృష్టి సారించనున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఓ వైపు ప్రభుత్వ పథకాల ప్రచారం, మరోవైపు పార్టీ కార్యకలాపాలతో శ్రేణులను సన్నద్ధం చేసే పని విరామం లేకుండా కొనసాగనున్నది.
నల్లగొండ ప్రతినిధి, మార్చి13(నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ మరింత దూకుడు ప్రదర్శించేందుకు సిద్ధ్దమవుతోంది. ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ పరంగా మరింత సమన్వయంపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర క్యాబినేట్ నిర్ణయాల మేరకు రానున్న కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నారు. వీటిని కూడా ఉత్సవాల మాదిరిగా నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా సిద్ధమవుతున్నారు. గృహలక్ష్మి, దళిత బంధు, గొర్రెల పంపిణీ, పోడుభూములకు పట్టాలు, పేదలకు ఇంటి హక్కులు వంటి సంక్షేమ పథకాల అమలుకు నిర్ణయించారు. వీటితో పాటు రాష్ట్ర స్థ్థాయిలో సచివాలయ ప్రారంభం, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వంటివి కూడా ఉన్నాయి. వీటిన్నింటినీ బేస్ చేసుకొని రానున్న కాలంలో ప్రభుత్వం పథకాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు.
సంక్షేమ పథకాల జాతర
రానున్న కాలంలో సంక్షేమ పథకాల జాతర కొనసాగనున్నది. ఇప్పటికే అమలు చేస్తున్న దళితబంధు, గొర్రెల పంపిణీ పథకాలను మరో విడుత అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దళిత బంధు పథకంలో నియోజకవర్గానికి మరో 1100 మంది లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు సిద్ధం చేసినా… జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లబ్ధిదారుల తుది ఎంపిక జరుగనున్నది. దాంతో ఉమ్మడి జిల్లాలో మరో 13,200 కుటుంబాలకు దళితబంధు చేరనున్నది. ఇక గొర్రెల పంపిణీ పథకం రెండో విడుతను ఏప్రిల్ రెండో వారం నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నల్లగొండలో 27,782, సూర్యాపేటలో 17,642 యూనిట్లను అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. పోడు భూములకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో సుమారు 2500 మందికి 3,800 ఎకరాలకు పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఫలితంగా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యకు చెక్ పడనున్నది. మరోవైపు సొంత జాగా ఉండి ఇండ్లు లేని పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా ఒక్కో నియోజకవర్గానికి 3వేల ఇండ్లను తొలి విడుతలో కేటాయించనున్నారు.
ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున మూడు దఫాలుగా ఇవ్వనున్నారు. డబుల్బెడ్రూం ఇండ్ల కేటాయింపు కూడా కొనసాగనున్నది. ఇక జీఓ నంబర్ 58, 59 ద్వారా ప్రభుత్వ స్థలాల్లోని పేదల ఇండ్లకు హక్కులు కల్పిస్తున్నారు. మరింత మందికి ప్రయోజనం కలిగేలా జీఓ నంబర్ 59 కటాఫ్ డేట్‌ను 2014 నుంచి 2020 వరకు పెంచారు. ఇవన్నీ కొద్దీ నెలల్లో పూర్తి కానున్నాయి. ఆయా కార్యక్రమాలను పార్టీ పరంగా ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లేలా చర్యలు చేపడుతున్నారు.
పార్టీ కార్యక్రమాలపై ఫోకస్
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా ఆవిర్భవించిన తర్వాత పూర్తిస్థాయి కార్యకలాపాలపై ఫోకస్ పెట్టారు. వచ్చే కొద్ది నెలల్లో విస్త్రతంగా కార్యక్రమాల నిర్వహణకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఇటీవల పార్టీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్యులతో సమావేమైన పార్టీ అధినేత కేసీఆర్ ఈ మేరకు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే.
దీనికి కొనసాగింపుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ సమన్వయకర్తల నియామకంపై దృష్టి సారించారు. పార్టీలో క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకు సమన్వయం కొనసాగేలా కార్యక్రమాలను రూపొందించారు. అందులో భాగంగా తక్షణమే ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణకు శ్రీకారం చుట్టనున్నారు. అందుకోసం ప్రత్యేకంగా జిల్లాల వారీగా కొత్తగా ఇన్చార్జీలను నియమించారు. నల్లగొండకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, సూర్యాపేటకు కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, యాదాద్రి భువనగిరికి ఎమ్మెల్సీ యాదవరెడ్డి నియామకమయ్యారు. వీరు ఒకటి రెండు రోజుల్లోనే పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.
పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం
పార్టీ జిల్లా కార్యాలయాలను కూడా రానున్న రెండు నెలల్లో ప్రారంభించుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో సభలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు జూన్ ఒకటో తేదీన హైదరాబాద్‌లో అమరవీరుల స్మారక స్థూపం ఆవిష్కరణ నేపథ్యంలోనూ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు పార్టీ విద్యార్థి విభాగాన్ని సైతం బలోపేతం చేసేలా చర్యలు తీసుకోనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని విద్యాసంస్థల్లో బీఆర్ఎస్వీ కమిటీలు ఉండాలని కేటీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో వరుసగా మూడు నాలుగు నెలలు బీఆర్ఎస్లో పార్టీ కార్యక్రమాలతో సందడి నెలకొన నున్నది. పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపడంతో పాటు భరోసా కల్పిస్తూ సమన్వయంతో నడిపించడమే లక్ష్యంగా కార్యాచరణ కొనసాగనున్నది.
ఆత్మీయ సమ్మేళనాలు
పది గ్రామాలకు ఒక యూనిట్‌గా చేసి ఆత్మీయ సమ్మేళనాల ఏర్పాటుకు షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. సమ్మేళనాల్లో పార్టీ సాధారణ కార్యకర్తల నుంచి మొదలు అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, పార్టీ, అనుబంధ సంఘాల నేతలను భాగస్వాములు చేయనున్నారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో మండలాల వారీగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు పార్టీ క్యాడర్లో ఉత్తేజాన్ని నింపిన విషయం తెలిసిందే. అదే తరహాలో తాజాగా ఆత్మీయ సమ్మేళనాలకు సిద్ధమవుతున్నారు. వీటి నిర్వహణ పూర్తయ్యే లోపు పార్టీ ఆవిర్భావ వేడుకలు రానున్నాయి.
దాంతో ఏప్రిల్ 25వ తేదీన నియోజకవర్గ స్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యులతో సభలు నిర్వహించాల్సి ఉంటుంది. అదేరోజు ఉదయం పార్టీ పతాకాల ఆవిష్కరణ అనంతరం ఉదయం నుంచి సాయంత్రం వరకు సభ జరిగేలా చూడనున్నారు. అంతకుముందు ఏప్రిల్ 14న సచివాలయం, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణకు పిలుపునిచ్చారు. దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన దళితబంధుతో పాటు ఇతర అభివృద్ధి పథకాలను ఈ సందర్భంగా విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.