మిర్యాలగూడ, నవంబర్ 9: స్వరాష్ట్రంలో పదేండ్లుగా సీఎం కేసీఆర్ సారథ్యంలో జరిగిన అభివృద్ధి, అన్ని వర్గాలకు అందిన సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు కోరారు. గురువారం పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరులకు ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలతో భారీ ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో 2018 నుంచి 2023 వరకు రూ.2750 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన వారు ఎంత మేరకు అభివృద్ధి చేశారో, 2014 తరువాత జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. అభివృద్ధి చేసిన వారిని ఆదరించాలని పిలుపునిచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మిర్యాలగూడ నియోజకవర్గంలో మారుమూలన ఉన్న 50 తండాలను గ్రామపంచాయతీలుగా చేసి వాటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దామరచర్ల మండలం వీర్లపాలెంలో రూ.30వేల కోట్లతో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక మైన యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌ను నిర్మిస్తున్నామని, ఇది మరో 4 నెలల్లో పూర్తవుతుందని చెప్పారు. ఈ పవర్‌ప్లాంట్ పూర్తయితే 4వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండబోతుందని అన్నారు.
నియోజకవర్గం పరిధిలో రూ.1000కోట్లతో ఐదు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేయించినట్లు చెప్పారు. వీటిలో దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల పరిధిలో మూడు ఎత్తిపోతల పథకాల పనులు వేగంగా జరుగుతున్నాయని, మరో రెండు టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. ఈ ఎత్తిపోతల పథకాల నిర్మాణం పూర్తయితే 50వేల ఎకరాల బీడు భూములు సాగులోకి వస్తాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రతి కుటుంబానికి రూ.5లక్షల కేసీఆర్ బీమా పథకం అందనుందని, దీనివల్ల సామాన్యుడు చనిపోయినా ఆ కుటుంబానికి రూ.5లక్షల సాయం అందుతుందన్నారు. దాంతో పాటు సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు రూ.3వేలు అందించనున్నట్లు చెప్పారు.
పేదలందరికీ రూ.400కే గ్యాస్ సిలిండర్, కేసీఆర్ ఆరోగ్యరక్ష పథకం ద్వారా రూ.15లక్షలు విలువైన వైద్యం ఉచితంగా అందనుందని తెలిపారు. రైతుబంధును రూ.10వేల నుంచి రూ.16 వేలకు పెంచి అన్నదాతలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ ఇక నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందించనున్నట్లు చెప్పారు. అగ్రవర్ణ పేదలకు గురుకులాలు ఏర్పాటు చేసి వారి పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించనున్నామని తెలిపారు.
పదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలు పొందిన ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి మరింత అభివృద్ధి చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, డీసీఎంఎస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మోసీన్‌అలీ, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మార్కెట్ చైర్మన్ బైరం సంపత్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు అన్నభీమోజు నాగార్జునాచారి, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, నల్లమోతు చైతన్య, నల్లమోతు సిద్ధార్థ, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, మట్టపల్లి సైదులుయాదవ్, కూరాకుల చినరామయ్య, చిర్ర మల్లయ్యయాదవ్, ధనావత్ చిట్టిబాబునాయక్, మగ్ధుంపాషా, ఇరుగు వెంకటయ్య, నూకల సరళాహన్మంతరెడ్డి, బాలాజీనాయక్, శ్రీవిద్య, ఇరుగు మంగమ్మ, లలితాహతీరాం, సేవ్యానాయక్, పోకల రాజు పాల్గొన్నారు.