కోదాడ, నవంబర్ 3 : గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో 50 వేలకు ఒక్క ఓటు తగ్గినా రాజకీయం సన్యానం చేస్తానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పిన వ్యాఖ్యలను ప్రజలు అపహాస్యం చేస్తున్నారని, ఒక జోకర్‌గా చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. శుక్రవారం కోదాడ బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ అంశాలపై ఆయన ముచ్చటించారు. వేనేపల్లి చందర్రావు ఒక కోవర్టు అని, అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టే రకమని విమర్శించారు.
ఎనిమిది పదులు దాటినా హుందాగా వ్యవహరించాల్సింది పోయి.. తనకు పొసగని పార్టీతో జత కట్టడం చీకటి ఒప్పందంలోనే భాగమేనని చెప్పారు. ఆయన మాటలు నమ్మి పార్టీ మారిన నాయకులు పునరాలోచించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీని అడ్డుపెట్టుకొని కాంట్రాక్టర్లు తెచ్చుకొని కోట్లు సంపాదించిన చందర్రావు చరిత్ర హీనుడు అని విమర్శించారు. చందర్రావు ప్యాకేజీ నాయకుడని, ఆయన మాయమాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2009లో ఓ మైనార్టీ నాయకుడుని ఎన్నికల బరిలో నిలిపి ఓడించి, చందర్రావుకు సహకరించారని, ఇది చీకటి ఒప్పందంలో భాగం కాదా అని ప్రశ్నించారు. ఉత్తమ్ దంపతులకు కోదాడ, హుజూర్‌నగర్‌లో ఓటమి తప్పదన్నారు.
15 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలతో మమేకమై 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, సరిహద్దు నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర షురూ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని, ఈనెల 30న జరిగే పోలింగ్‌లో బీఆర్ఎస్కు ఓట్లు వేసి అభివృద్ధి ప్రదాత రుణం తీర్చుకుంటామని చెబుతున్నారని తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన శశిధర్‌రెడ్డి.. అధిష్టానం తనకు టిక్కెట్ ఇవ్వన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్‌లో ఆయనకు తగిన సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయమన్నారు.