నల్లగొండ, నవంబర్ 29 : కేసీఆర్ దీక్షా, పట్టుదల వల్లనే తెలంగాణ రాష్ట్రం నేడు ప్రపంచ పటంలో నిలిచిందని, దీనికి కేసీఆర్ తప్ప ఏ ఒక్కరూ కారణం కాదని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన దివస్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టాన్ని ఏ ఒక్కరూ ఇవ్వలేదని, కేసీఆర్ తెగించి కొట్లాడడం వల్ల గత్యంతరం లేక ఇచ్చినట్లు తెలిపారు. కేసీఆర్ తెలంగాణకు జరుగుతున్న అన్యాయన్ని గుర్తించి నాలుగేండ్లు ఎంతోమందితో చర్చించి రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీని స్థాపించారని చెప్పారు.
ఆంధ్రా పాలకులు తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంతోపాటు తెలంగాణలో రైతులకు విద్యుత్ చార్జీలను పెంచడం కూడా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ఒక కారణంగా చెప్పుకొచ్చారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు చేపట్టిన చంద్రబాబు పోకడలను నిరసిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి తర్వాత టీఆర్ఎస్ను స్థాపించినట్లు తెలిపారు. ఇరిగేషన్ రంగంలో మైనర్ ఇరిగేషన్ పేరుతో తెలంగాణకు తక్కువ నిధులు, మేజర్ ఇరిగేషన్ పేరుతో ఆంధ్రాకు ఎక్కువ నిధులు ఇస్తూ మోసం చేయడంతోపాటు అక్కడ రైతులకు నీటితీరువాను తీసుకోకుండా తెలంగాణ రైతుల పట్ల కఠినంగా వ్యవహరించడం కారణంగానే మారిన కేసీఆర్‌ను చంద్రబాబు అండ్ కో, ఆయన మీడియా విషపు ప్రచారం చేసినట్లు చెప్పారు. అలాంటి సందర్భంలో నా స్వప్నం… నాధ్యేయం… నా సంకల్పం… నా విజన్ అంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమేనని, ఈ మధ్యలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనుకడుగు వేసేది లేదని, పార్టీ మారేది లేదని ముందుకు సాగిన మహానేత కేసీఆర్ అంటూ గుర్తుచేశారు.
అయితే ఆర్టికల్3 ద్వారా పార్లమెంట్లో బిల్లు పాస్ చేపిస్తే తెలంగాణ వస్తుందనే ఉద్దేశంతో ఎన్నికలను ఆయుధంగా చేసుకుని ముందుకు సాగినట్లు తెలిపారు. కామన్ మినిమన్ ప్రోగ్రాంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని చేరుస్తామంటే అప్పట్లో పొత్తుపెట్టుకున్నాక.. చంద్రబాబు, వైఎస్ఆర్ ఏకమై కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలంగాణ ఇవ్వకుండా చేయడం వల్లే కేసీఆర్ దీక్ష వరకు వెళ్లినట్లు చెప్పారు. దీక్ష సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎన్ని కుట్రలు చేసినా విరమించకపోవడం వల్లనే తెలంగాణ ఇస్తామని నాడు కేంద్రం ప్రకటించినట్లు తెలిపారు. ఆంధ్రాలో అన్ని పార్టీల వారు కుట్రలు పన్ని మరో ప్రకటన వ్యతిరేకంగా చేయించినప్పటికీ కేసీఆర్ పట్టుదల, తెలంగాణ ప్రజల సహకారం వల్ల రాష్ట్రం సిద్దించినట్లు చెప్పారు. ఈ విషయంలో తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు తెలంగాణ రాష్ర్టానికి సహకరించలేదని, ఒక్క టీఆర్ఎస్ వల్లనే ఈ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. వచ్చిన రాష్ర్టాన్ని పదేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటే ఏడాదిలోనే రేవంత్ సర్కార్ సర్వనాశనం చేసినందని విమర్శించారు.
చెప్పడంలో విఫలమయ్యాం..
తెలంగాణ రాష్ట్రం రావడానికి కేసీఆర్ త్యాగమే కీలకమని, గులాబీ జెండానే కారణమని, మోసాలను, కుట్రలను ఛేదిస్తూ కేసీఆర్ అనుసరించిన పోరాట వ్యూహామే సాధనని జగదీశ్‌రెడ్డి తెలిపారు. వీటన్నింటితోనే తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యిందన్న వాస్తవాన్ని మనం భవిష్యత్తు తరాలకు, ముఖ్యంగా నేటీ యువతకు చెప్పడంలో బీఆర్ఎస్ పార్టీగా వెనకబడ్డామని చెప్పారు. ఆయన త్యాగమే తెలంగాణ తెచ్చిందని మనం చెప్పుకోవడంలో విఫలమయ్యామని, కేవలం మనం అభివృద్ధి వెంటే పడ్డాం..ఆ ముచ్చటే ప్రజలకు చెప్పామని, కానీ కేసీఆర్ త్యాగాన్ని ఇప్పటి తరంలోకి తీసుకెళ్లడంలో పొరపడ్డామని తెలిపారు. ఇప్పటికైనా మన దూరమైన వర్గాలకు దగ్గరయ్యేలా కార్యాచరణ ఉండాలని, ప్రస్తుత తరానికి వాస్తవాలు చెప్పాలని సూచించారు. తెలంగాణ ఎందుకొచ్చింది? ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగం ఏంటీ? నాయకత్వ పటిమ ఎట్లుండే? ఇలాంటి విషయాలన్నీ మళ్లీ విస్తృతంగా ప్రజల్లోకి, ముఖ్యంగా యువతలోకి తీసుకెళ్లాలని తెలిపారు. భారీ సంఖ్యలో తరలిచ్చిన దీక్షా దివస్‌లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు.
భావోద్వేగానికి లోనైన జగదీశ్‌రెడ్డి
కేసీఆర్ దీక్ష విషయాన్ని ప్రస్తావిస్తున్న సందర్భంలో జగదీశ్‌రెడ్డి భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. 2009 డిసెంబర్ 9న కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తుందని, కాసేపట్లో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబితే.. తామంతా భయపడి కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే పరిస్థితిలో లేదు, దీక్ష విరమించమని కేసీఆర్‌ను కోరితే ‘తెలంగాణ వస్తేనే కేసీఆర్ దీక్ష నుంచి బయటకు వస్తాడు.. లేదంటే నా శవాన్ని తీసుకెళ్లి ఊరేగించండి’ అన్నాడు తప్ప దీక్షను మాత్రం విరమించలేదని చెబుతున్న సందర్భంలో జగదీశ్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. రాజులేని రాజ్యం ఎలా ఉంటుందో, నాయకుడు లేని పార్టీ రాష్ట్ర సాధన కోసం ముందుకు వెళ్తున్న సందర్భంలో విచ్ఛిన్నం అవుతుందేమోనని భయపడినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కేసీఆర్ మొండితనం పట్టుదల వల్లనే కేంద్రం అదే రోజున రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నామని ప్రకటన చేసిందన్నారు.
దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు నల్లగొండ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఎన్జీ కళాశాల వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. దీక్షా దివస్ సభా ప్రాంగణంలో కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చకిలం అనిల్ కుమార్, చెరుకు సుధాకర్, పాల్వాయి స్రవంతి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాంచంద్రనాయక్, మాలె శరణ్యారెడ్డి, కటికం సత్తయ్య గౌడ్, బొర్ర సుధాకర్, రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్తోపాటు మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
కేసీఆర్ దీక్షా దివస్ స్ఫూర్తితో ఉద్యమిద్దాం..
కేసీఆర్ దీక్షా దివస్తోనే తెలంగాణ ఏర్పాటకు అడుగులు పడ్డాయి. ఆ తర్వాత రాష్ట్రం సిద్ధించింది. కేసీఆర్ నేతృత్వంలో 10 ఏండ్లు సుభిక్షంగా ఉన్నాం. తెలంగాణ ఏర్పాటైతే ఏం చేస్తామని చెప్పామో.. అన్నీ చేసుకుంటూ వచ్చినం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాలు, సబ్బండ జాతులు బాధపడుతున్నాయి. ఏ వర్గానికి కూడా మేలు జరుగలేదు. అందరూ కేసీఆర్‌నే కోరుకుంటున్నారని సర్వేల్లో జనం చెప్తున్నరు. రేవంత్ రెడ్డి.. సోనియాగాంధీని బలి దేవత అన్నడు. ఆమె నాయకత్వంలోనే పనిచేస్తున్నా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతోనే రాష్ర్టాన్ని పరిపాలిస్తున్నారు.
– కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే
అబద్ధపు మాటలతోనే రేవంత్ సర్కారు పాలన
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఆరు గ్యారెంటీలు, 420 హామీలను పక్కన పెట్టిన రేవంత్ సర్కార్ అబద్ధపు మాటలతో కాలం గడుపుతున్నది. బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వదిలేసింది. పాత పథకాల అమలుతో పాటు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రజలు నిలదీస్తూనే ఉండాలి. ప్రధానంగా యువత దీనిపై దృష్టి సారిస్తూ దీక్షా దివస్ స్ఫూర్తితో ముందుకు సాగాలి.
– నోముల భగత్, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే
రాష్ట్రం కోసం పదవులను తృణప్రాయంగా వదిలారు
తెలంగాణ రాష్ట్రం కోసం నాడు కేసీఆర్‌తోపాటు ఆయన టీమ్‌లోని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులందరూ పదవులను తృణ ప్రాయంగా వదిలారు. నాడు శాసన సభలో ఆంధ్రా పాలకులు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను ఎంతో అవహేళన చేసినా రాష్ట్రం కోసం భరిస్తూ పోరాటం దిశగా ముందుకు సాగారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల మూలంగానే ఇక్కడి నుంచి పొరుగు ప్రాంతాలకు వలసలు తగ్గి పొరుగు ప్రాంతాల నుంచే ఇక్కడి వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. త్వరలో స్థానిక సంస్థలు వస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకాలకు తెర లేపుతున్నదన. వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజలు, పార్టీ శ్రేణులపై ఉంది. కేసులతో భయపెడితే ఏ ఒక్క కార్యకర్త కూడా భయపడ వద్దు. సూచించారు.
– చిరుమర్తి లింగయ్య, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
స్వాతంత్య్రాన్ని తెచ్చింది గాంధీ అయితే… తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కేసీఆర్
దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చింది మహాత్మా గాంధీ అయితే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ ఉద్యమంతోపాటు దీక్ష చేయడం వల్లే యావత్ తెలంగాణ కదిలింది. కేసీఆర్ దీక్ష మూలంగానే కేంద్రం దిగివచ్చి రాష్ట్రం ఇచ్చిందే తప్ప ఇందులో ఎవరి దయా దాక్షిణ్యాలు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టు బాగాలేదని, యాదాద్రి పవర్‌ప్లాంట్ మూసివేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇవ్వాళ కాళేశ్వరం నీళ్లు ఎలా వాడుతున్నారు.. యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాంభానికి ఎలా వస్తున్నారు. మేము చేసిన అభివృద్ధి పనులు మీరు ప్రారంభించడం సిగ్గనిపిస్తలేదా.
– నల్లమోతు భాస్కర్ రావు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే