ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12కు 12 అసెంబ్లీ స్థానాలు గెలువబోతున్నాం అంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మరుసటి రోజే గెలుపు గుర్రాల జాబితా వెల్లడైంది. పార్టీ శ్రేణుల మనోగతాన్ని గుర్తెరుగుతూ అనేక కోణాల్లో అంచనాలు, వ్యూహాలు, సర్వేల సారాంశంతో బీఆర్ఎస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. మొత్తం 12 అసెంబ్లీ స్థానాలకు ఒకే దఫాలో అభ్యర్థులను ప్రకటించి సార్వత్రిక సమారానికి సై అన్నారు. గెలుపుపై భరోసానిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మరోసారి అవకాశం కల్పిస్తూ పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపుచేశారు. సూర్యాపేట నుంచి మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం బరిలో నిలువనున్నారు. దేవరకొండ(ఎస్టీ రిజర్వ్డ్)కు రవీంద్రకుమార్, నాగార్జునసాగర్‌కు నోముల భగత్, మిర్యాలగూడకు నల్లమోతు భాస్కర్‌రావు, హుజూర్‌నగర్‌కు శానంపూడి సైదిరెడ్డి, కోదాడకు బొల్లం మల్లయ్యయాదవ్, నల్లగొండకు కంచర్ల భూపాల్‌రెడ్డి, మునుగోడుకు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఆలేరుకు గొంగిడి సునీత, భువనగిరికి పైళ్ల శేఖర్‌రెడ్డి, నకిరేకల్ (ఎస్సీ రిజర్వ్డ్)కు చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తి(ఎస్సీ రిజర్వ్డ్)కి గాదరి కిశోర్‌కుమార్ పేర్లు మరోసారి ఖరారయ్యాయి. 2018 ఎన్నికల్లో తొలి జాబితాలో 10 మందికే అవకాశం కల్పించగా, ఈ సారి ఎవరూ ఊహించని విధంగా ఒకే దఫాలో అన్ని స్థానాలను ప్రకటించారు. ఊహలకు అందని వ్యూహంతో సీఎం కేసీఆర్ మరోసారి విపక్షాలను అయోమయంలో పడేశారు.
– నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ)
‘ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలానికి నిదర్శనం రానున్న ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థులే. మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున సూర్యాపేట అభ్యర్థిగా మూడో సారి నాకు, ఉమ్మడి జిల్లాలోని ప్రస్తుత ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు. కాంగ్రెస్ కంచుకోట కరిగిపోయింది, ఉమ్మడి నల్లగొండ కేసీఆర్ ఖిల్లాగా మారింది. రాజకీయాల్లో టికెట్లు ఆశించడం తప్పు కాదు, టికెట్ రాని వారు నిరాశ పడొద్దు. అందరూ సహచర నేతలను కలుపుకొని పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి.
-రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల షెడ్యూల్‌కు రెండు నెలల ముందుగానే ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 119 స్థానాలు ఉండగా.. అందులో 115 స్థానాలకు ఒకే దఫాలో అభ్యర్థులను ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా 12 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసి పేర్లను వెల్లడించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తామని ముందు నుంచీ చెప్తూ వస్తున్న ముఖ్యమంత్రి.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అందరికీ మరోసారి టికెట్లు కట్టబెట్టారు. గత సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన వారితోపాటు మధ్యలో జరిగిన ఉప ఎన్నికల విజేతలకు సైతం మరోసారి అవకాశం కల్పించారు.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సహా మిగతా రాజకీయ పార్టీలు ఇంకా అభ్యర్థుల వేటలో ఉండగా వారికి షాక్ ఇస్తూ అందరికి అందరినీ ఖరారు చేయడం సంచలనంగా మారింది. ఆదివారం సూర్యాపేట ప్రగతి నివేదన సభలో ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలు గెలువబోతున్నామంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. అన్నట్లుగానే ప్రస్తుతం ఉన్న స్థానాల్లో ఎవరైతే పక్కా గెలుస్తారని భావిస్తున్నారో వాళ్లకే టికెట్లను కేటాయించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలతోపాటు ఆశావహులను సైతం పరిగణలోకి తీసుకుని పరిశీలన చేసినట్లు తెలిసింది. అన్ని కోణాల్లో అభ్యర్థుల బలాబలాలను, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పరిశీలనలోకి తీసుకున్నారు. దీంతోపాటు పలు దఫాల సర్వేలు, సర్వేల్లో పార్టీ శ్రేణులతోపాటు సాధారణ ప్రజల మనోగతాన్ని కూడా విశ్లేషించారు. అన్ని కోణాల్లో కసరత్తు అనంతరమే ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టమైంది. దీంతో సిట్టింగ్‌లను బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఖరారు చేశారు.
ఉమ్మడి జిల్లా ఎన్నికల చరిత్రలోనే 12కు 12కు అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేసి బీఆర్ఎస్ పార్టీ సరికొత్త రికార్డును నెలకొల్పింది. రాష్ట్ర సాధనకు ముందు పలుమార్లు ఆలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థ్ధి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. 2014లో రాష్ట్ర ఏర్పాటు సమయంలో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొడుతూ సగం స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది. ఆ ఎన్నికల్లో ఆరు అసెంబ్లీ స్థానాలతోపాటు ఒక ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ ఒక ఎంపీ, ఐదు అసెంబ్లీ స్థానాలు, సీపీఐ ఒక స్థానంలో గెలుపొందాయి. 2016 జూన్‌లో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, సీపీఐకి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ బీఆర్ఎస్లో చేరారు. దీంతో బీఆర్ఎస్ బలం రెండు ఎంపీలు, 8 అసెంబ్లీ స్థానాలకు చేరింది. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అనూహ్యంగా కాంగ్రెస్ హేమాహేమీలను మట్టి కరిపించి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్లో చేరారు.
2019లో హుజూర్నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా గెలుపొందడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 11కు చేరింది. ఇక గత ఏడాది నవంబర్‌లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపొందడంతో 12కు 12 అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ ఖాతాలో చేరాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో విజయాన్ని సంపూర్ణం చేసినైట్లెంది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో మరోసారి రాబోయే ఎన్నికల్లో 12కు 12 స్థానాలు గెలిచేందుకు పార్టీ సన్నద్ధం అవుతున్నది. ఆదివారం సూర్యాపేటలో జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాలు తిరిగి గెలువబోతున్నట్లు ధీమా వ్యక్తం చే చేరు. దీంతో పార్టీ శ్రేణులు రెట్టింపు విశ్వాసంతో ఎన్నికల కదనరంగంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థుల ప్రకటన వెలువడిన మరుక్షణం నుంచే ఉమ్మడి జిల్లా అంతటా సంబురాలు అంబరాన్నంటాయి. బాణసంచా కాలుస్తూ, స్వీట్లు పంచిపెడుతూ, డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. ఇదే ఉత్సాహంతో ఎన్నికల సమరానికి సై అంటూ అభ్యర్థులకు జై కొట్టారు.
బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఖరారైన వారిలో ఐదుగురు హ్యాట్రిక్ విజయం కోసం బరిలో నిలిచినైట్లెంది. సూర్యాపేట నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆలేరు నుంచి గొంగిడి సునీత, తుంగతుర్తి నుంచి గాదరి కిశోర్‌కుమార్, భువనగిరి నుంచి పైళ్ల శేఖర్‌రెడ్డి, మిర్యాలగూడ నుంచి నల్లమోతు భాస్కర్‌రావు వరుసగా 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందారు. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల్లోనూ గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఇదే సమయంలో మూడోసారి విజయం కోసం చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కూడా సిద్ధమయ్యారు. 2009లో తొలిసారి గెలుపొందిన లింగయ్య 2014లో ఓటమి పాలై తిరిగి 2018లో రెండోసారి గెలిచారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 2014లో తొలిసారి విజయం సాధించి 2018లో ఓటమి పాలయ్యారు. తిరిగి 2022 నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిద్దరూ ప్రస్తుతం మూడోసారి విజయం కోసం బరిలోకి దిగుతున్నారు. ఇక దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాల్గోసారి విజయం కోసం సై అంటున్నారు. 2004లో తొలిసారి సీపీఐ నుంచి గెలిచి 2009లో ఓడిపోయారు. తిరిగి 2014లో రెండో సారి గెలిచారు. 2018లో బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి మూడోసారి గెలుపొంది, మరో విజయం కోసం సన్నద్ధం అవుతున్నారు. కోదాడ, నల్లగొండ నుంచి తొలిసారి గెలుపొందిన బొల్లం మల్లయ్యయాదవ్, కంచర్ల భూపాల్‌రెడ్డి వరుసగా రెండో విజయం కోసం బరిలోకి దిగుతున్నారు. ఉప ఎన్నికల్లో గెలుపొందిన హుజూర్నగర్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్‌కుమార్ జనరల్ ఎన్నికల్లో రెండో విజయం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
తల్లిదండ్రులు : కౌసల్య, మల్లారెడ్డి
కుటుంబం : భార్య రమాదేవి, ఒక కూతురు
స్వస్థలం : ఉరుమడ్ల గ్రామం, చిట్యాల మండలం
వయస్సు : 50
విద్యార్హతలు : బీకామ్
పార్టీ : బీఆర్ఎస్
రాజకీయ ప్రవేశం : 1993
ఎన్నికల్లో పోటీ : రెండు సార్లు అసెంబ్లీకి
గెలుపు : ఒకసారి
రాజకీయ ప్రస్థానం : తెలుగుదేశం పార్టీతో రాజకీయంలోకి వచ్చిన భూపాల్‌రెడ్డి 2014లో నల్లగొండ శాసన సభకు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి వెంకట్‌రెడ్డిపై 23,698 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
తల్లిదండ్రులు : సావిత్రమ్మ, రాంచంద్రారెడ్డి
కుటుంబం : భార్య సునీత, ఒక కుమారుడు, ఒక
పుట్టిన స్థలం : నాగారం
వయస్సు : 58
విద్యార్హతలు : బీఏ, బీఎల్
పార్టీ : బీఆర్ఎస్
రాజకీయ ప్రవేశం : 2001
ఎన్నికల్లో పోటీ : మూడు సార్లు అసెంబ్లీకి
గెలుపు : రెండు సార్లు
రాజకీయ ప్రస్థానం : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగిన జగదీశ్‌రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించి విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
తల్లిదండ్రులు : సుజాత, మారయ్య
కుటుంబం : భార్య కమల, ఇద్దరు కుమారులు
స్వస్థలం : నల్లగొండ
వయస్సు : 43
విద్యార్హతలు : పీహెచ్డీ
పార్టీ : బీఆర్ఎస్
రాజకీయ ప్రవేశం : 2014
ఎన్నికల్లో పోటీ : రెండు సార్లు అసెంబ్లీకి
గెలుపు : రెండు సార్లు
రాజకీయ ప్రస్థానం : మొదటి నుంచీ టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో కీలకంగా ఉంటూ ఓయూ జేఏసీ వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలుకు సైతం వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2014, 2018లో తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గ చరిత్రలో చిన్న వయస్సులో అసెంబ్లీకి ఎన్నికై రికార్డు సృష్టించారు.
తల్లిదండ్రులు : సత్యవతి, అంకిరెడ్డి
కుటుంబం : భార్య రజిత, ఇద్దరు కుమారులు
స్వస్థలం : గుండ్లపల్లి గ్రామం, మఠంపల్లి మండలం
వయస్సు : 49
విద్యార్హతలు : బీఎస్సీ
పార్టీ : బీఆర్ఎస్
రాజకీయ ప్రవేశం : 2018
ఎన్నికల్లో పోటీ : రెండు సార్లు అసెంబ్లీకి
గెలుపు : ఒకసారి
రాజకీయ ప్రస్థానం : 2018లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. 2019 ఉప ఎన్నికల్లో ఉత్తమ్ పద్మావతిపై 43,359 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
తల్లిదండ్రులు : అనంతమ్మ, రాంరెడ్డి
కుటుంబం : భార్య వనిత, ఒక కుమారుడు, ఒక కుమార్తె
స్వస్థలం : కదిరేనిగూడెం (నాంచారిపేట), ఆత్మకూరు(ఎం) మండలం
వయస్సు : 55
విద్యార్హతలు : సివిల్ ఇంజినీరింగ్ ఇన్ డిప్లమో
పార్టీ : బీఆర్ఎస్
రాజకీయ ప్రవేశం : 2014
ఎన్నికల్లో పోటీ : రెండు సార్లు అసెంబ్లీకి
గెలుపు : రెండు సార్లు
రాజకీయ ప్రస్థానం : పైళ్ల సేవా ట్రస్ట్ ఏర్పాటు చేసి 2014 వరకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2014లో బీఆర్ఎస్లో పార్టీలో చేరారు. 2014, 2018 ఎన్నికల్లో భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
తల్లిదండ్రులు : మారమ్మ, నర్సింహ
కుటుంబం : భార్య పార్వతమ్మ, ఒక కుమారుడు
స్వస్థలం : బ్రాహ్మణవెల్లెంల,
నార్కట్‌పల్లి మండలం
వయస్సు : 50
విద్యార్హతలు : ఇంటర్మీడియట్
పార్టీ : బీఆర్ఎస్
రాజకీయ ప్రవేశం : 1995
ఎన్నికల్లో పోటీ : మూడు సార్లు అసెంబ్లీకి
గెలుపు : రెండు సార్లు
రాజకీయ ప్రస్థానం : 1995లో బ్రాహ్మణవెల్లెంల ఎంపీటీసీగా గెలుపొంది క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2001లో కాంగ్రెస్ నుంచి నార్కట్‌పల్లి జడ్పీటీసీగా, 2009లో నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. కొద్ది కాలానికే బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
తల్లిదండ్రులు : నోముల లక్ష్మి, నర్సింహయ్య
కుటుంబం : భార్య భవాని, ఒక కుమారుడు, ఒక కుమార్తె
స్వస్థలం : పాలెం గ్రామం, నకిరేకల్ మండలం
వయస్సు : 40
విద్యార్హతలు : బీఈ, ఎంబీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం
పార్టీ : బీఆర్ఎస్
రాజకీయ ప్రవేశం : 2014
ఎన్నికల్లో పోటీ : ఒకసారి అసెంబ్లీకి
గెలుపు : ఒకసారి
రాజకీయ ప్రస్థానం : 2008 నుంచి 10వరకు సత్యం కంప్యూటర్స్‌లో జూనియర్ ఇంజినీర్‌గా, 2010-12లో విస్టా ఫార్మాన్యూటికల్స్లో అసిస్టెంట్ మేనేజర్‌గా, 2014లో హైకోర్టు న్యాయవాదిగా పని చేశారు. 2020 డిసెంబర్లో తండ్రి నర్సింహయ్య మరణంతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 2021లో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి జానారెడ్డిపై విజయం సాధించారు.
తల్లిదండ్రులు : కారింగుల సరళ, నర్సింహారెడ్డి
కుటుంబం : భర్త గొంగిడి మహేందర్‌రెడ్డి,
ఇద్దరు కుమార్తెలు
స్వస్థలం : వంగపల్లి, యాదగిరిగుట్ట మండలం
వయస్సు : 54
విద్యార్హతలు : బీకామ్ కంప్యూటర్
పార్టీ : బీఆర్ఎస్
రాజకీయ ప్రవేశం : 2001
ఎన్నికల్లో పోటీ : రెండు సార్లు అసెంబ్లీకి
గెలుపు : రెండు సార్లు
రాజకీయ ప్రస్థానం : 2001లో బీఆర్ఎస్లో చేరి యాదగిరిగుట్ట ఎంపీపీగా, వంగపల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2002లో బీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, 2005లో పార్టీ రాష్ట్ర ఆర్గనైజర్‌గా, 2009 నుంచి 2014 వరకు పొలిట్ బ్యూర్ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014, 2018 ఎన్నికల్లో ఆలేరు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేపట్టారు.
తల్లిదండ్రులు : బొల్లం వీరమ్మ, వీరయ్య
కుటుంబం : భార్య ఇందిర,
ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
స్వస్థలం : కరివిరాల గ్రామం, నడిగూడెం
మండలం
వయస్సు : 58
విద్యార్హతలు : ఎంఏ, ఎంఫిల్
పార్టీ : బీఆర్ఎస్
రాజకీయ ప్రవేశం : 2007
ఎన్నికల్లో పోటీ : మూడు సార్లు అసెంబ్లీకి
గెలుపు : ఒకసారి
రాజకీయ ప్రస్థానం : ఉస్మానియా యూనివర్శిటీలో చదవుతున్న రోజుల్లోనే విద్యార్థి సంఘంలో క్రియాశీల పాత్ర పోషించారు. ఆ తర్వాత జంట నగరాలకు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. సొంత గడ్డపై మమకారంతో 2007లో రాజకీయ ఆరంగేట్రం చేసి 2009లో కోదాడ నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2012లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2018లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతిపై గెలుపొందారు.
తల్లిదండ్రులు : జానకమ్మ, కన్నిలాల్
కుటుంబం : భార్య శ్యామల, ఒక కుమారుడు, కుమార్తె
స్వస్థలం : శేరుపల్లి (రత్యతండా) గ్రామం, దేవరకొండ మండలం
వయస్సు : 51
విద్యార్హతలు : ఎంఏ, ఎల్ఎల్బీ
పార్టీ : బీఆర్ఎస్
రాజకీయ ప్రవేశం : 1995
ఎన్నికల్లో పోటీ : నాలుగు సార్లు అసెంబ్లీకి
గెలుపు : మూడుసార్లు
రాజకీయ ప్రస్థానం : 20 సంవత్సరాలపాటు కమ్యూనిస్టు పార్టీలో పని చేసి 2016లో బీఆర్ఎస్లో చేరారు. శేరిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రెండు పర్యాయాలు పని చేశారు. 2004లో సీపీఐ నుంచి దేవరకొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఎమ్మెల్యేగా పొటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రవీంద్రకుమార్.. 2016లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 38వేల ఓట్ల తేడాతో జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించారు. 2022లో బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులై ఇప్పటికీ కొనసాగుతున్నారు.
తల్లిదండ్రులు : వెంకటరామయ్య, లక్ష్మీకాంతమ్మ
కుటుంబం : భార్య జయ, ఇద్దరు కుమారులు
స్వస్థలం : ముదిగొండ, నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా
వయస్సు : 70
విద్యార్హతలు : బీఎస్సీ
పార్టీ : బీఆర్ఎస్
రాజకీయ ప్రవేశం : 1982
ఎన్నికల్లో పోటీ : రెండు సార్లు అసెంబ్లీకి
గెలుపు : రెండు సార్లు
రాజకీయ ప్రస్థానం : 1983లో నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి అలుగుబెల్లి అమరేందర్రెడ్డిపై గెలుపొందారు. 2017లో బీఆర్ఎస్లో చేరిన ఆయన.. 2018లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.కృష్ణయ్యపై 30,652 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
తల్లిదండ్రులు : కమలమ్మ, జంగారెడ్డి
కుటుంబం : భార్య అరుణ, ఒక కుమారుడు, ఒక కుమార్తె
స్వస్థలం : లింగవారిగూడెం, సంస్థాన్
నారాయణపురం మండలం
వయస్సు : 63
విద్యార్హతలు : బీఏ, బీఈడీ
పార్టీ : బీఆర్ఎస్
రాజకీయ ప్రవేశం : 2003
ఎన్నికల్లో పోటీ : నాలుగు సార్లు అసెంబ్లీకి
గెలుపు : రెండు సార్లు
రాజకీయ ప్రస్థానం : విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేసిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్ పిలుపునందుకొని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి వచ్చారు. 2003లో బీఆర్ఎస్లో చేరి మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేశారు.
2009లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మునుగోడు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో మునుగోడు నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.