నల్లగొండ ప్రతినిధి, మే 21(నమస్తే తెలంగాణ): డిజిటల్ విధానంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే జిల్లాల వారీగా ఇన్చార్జి లను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ఇన్చార్జిలను నియమించారు. వీరితో పాటు నియోజకవర్గానికి ఒక ఐటీ నిపుణుడిని కూడా ఎంపిక చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో వీరికి తెలంగాణ భవన్లో డిజిటల్ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తర్వాత జిల్లా పార్టీ కార్యాలయాల్లో నియోజకవర్గాల వారీగా వారం రోజులపాటు బూత్ లెవల్ ఇన్చార్జిలకు సభ్యత్వ నమోదుపై శిక్షణ ఇస్తారు.
అయితే డిజిటల్ యాప్ తుది మెరుగులు దిద్దుకుంటోందని, త్వరలోనే దీన్ని ఆవిష్కరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అన్ని స్థాయిల్లో శిక్షణా కార్యక్రమాలు పూర్తయ్యాక డిజిటల్ సభ్యత్వ నమోదు కోసం షెడ్యూల్ ప్రకటిస్తారు. దాని ప్రకారం నిర్ణీత గడువులోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాల్సి ఉంటుంది. పండుగ వాతావరణంలో దీన్ని పూర్తి చేశాక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ వరకు నూతన కార్యవర్గాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. ఈ కమిటీల ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గ సభ్యులకు ప్రత్యేకంగా శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను, యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎమ్మె ల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని సభ్యత్వ నమోదు ఇన్చార్జిలుగా నియమించిన విషయం తెలిసిందే. తాజాగా నియోజకవర్గాలకు సైతం ఇన్చార్జిలను ప్రకటించారు. నల్లగొండకు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, దేవరకొండకు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, నాగార్జున సాగర్‌కు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, మిర్యాలగూడకు మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మునుగోడుకు గోపగాని వెంకట నారాయణ గౌడ్, నకిరేకల్‌కు మాజీ జడ్పీ చైర్మన్ గుజ్జ దీపికా యు గేందర్రావు, భువనగిరికి క్యామ మల్లే శ్,
ఆలేరుకు మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, సూ ర్యాపేటకు మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, తుంగతుర్తికి ఎలగందుల వెంకటేశ్వర్లు, హుజూర్‌నగర్‌కు కంచర్ల కృష్ణారెడ్డి, కోదాడకు మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డిని ఇన్చార్జిలుగా ప్రకటించారు. వీరితోపాటు జిల్లాకు చెందిన పలువురు నేతలకు ఇతర జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పారు. మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డికి ఉప్పల్, పల్లె రవికుమార్‌కు దేవరకద్ర, పాల్వాయి స్రవంతికి జడ్చర్ల, మేడె రాజీవ్ సాగర్‌కు నారాయణపేట, దూదిమెట్ల బాలరాజు యాదవ్‌కు మక్తల్, చాడ కిషన్‌రెడ్డికి ఇల్లెందు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. వీరందరికీ త్వరలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శిక్షణ ఇవ్వనున్నారు.