దామరచర్ల, జూన్ 12: ‘మా ప్రాణాలను సైతం అడ్డుపెట్టి యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంటు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం’ అని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. వైటీపీఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దామరచర్ల మం డలం వీర్లపాలెంలోని ప్లాంటు వద్ద శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదాద్రి థర్మల్ పవర్ప్లాంటను కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాక, కమీషన్లకు కక్కుర్తిపడి ప్రైవేటీకరణ చేస్తోందని ఆరోపించారు.
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఈ ప్లాంటు ఏర్పాటుకు స్థానికులకు భరోసా కల్పించి అందరినీ ఒప్పించారని గుర్తు చేశారు. ఎంక్రోచర్స్కు ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు కొంత మందికే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని, దేశంలోనే పెద్ద పవర్‌ప్లాంటును ప్రైవేటుకు అప్పగిస్తే స్థానికుల ఉద్యోగాల సంగతి ఏమిటని ప్రశ్నించారు. ఇంకా 700 మందికి ఉద్యోగాలు రావాల్సి ఉందన్నారు.
చిన్న పొరపాట్లు ఉండటంతో వారసత్వం ఉద్యోగాల్లో వారిని పక్కకు పెట్టారని చెప్పారు. ప్లాంటు వస్తే రెండు వేల మంది స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఉన్నామని, అసలుకే ఎసరు వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ప్రాణాలను అడ్డుపెట్టి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని టెండర్లను రద్దు చేసే వరకు ప్రభావిత గ్రామస్తులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వీరకోటిరెడ్డి, ఎండీ యూసూఫ్, సోము సైదిరెడ్డి, కందుల నాగిరెడ్డి, వినోద్‌నాయక్, కొనకంచి సత్యనారాయణ, రాయికింది సైదులు, వీరబాబు, బైరం గోపి, కొండారపు నాగేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దామరచర్ల, జూన్ 12: యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంటు ప్రైవేటీకరణను రద్దు చేయాలని కోరుతూ ప్లాంటులోని ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. టెండర్లను రద్దు చేయాలని కోరుతూ రెండు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా చేసేందుకు ఏర్పాటు చేసిన వైటీపీఎస్ను ఉద్యోగుల కొరతను సాకుగా చూసి ప్రైవేటీకరణ చేయడం తగదన్నారు. స్థానికులు కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించి వెంటనే టెండర్ల ప్రక్రియను రద్దు చేయాలని, లేకుంటే ఆందోళలను తీవ్రతరం చేస్తామని జేఏసీ హెచ్చరించింది.