సూర్యాపేట, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలను మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెబుతుంటే ఓర్వలేని కాంగ్రెస్ శ్రేణు లు చిల్లర దందాలకు పాల్పడుతూ నినాదాలు చేస్తూ గలాటా సృష్టించేందుకు ప్రయత్నించిన ఘటన బుధవారం ఆత్మకూర్.ఎస్ మండలం నెమ్మికల్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే..గ్రామానికి మంజూరైన ఇండ్ల పట్టాలు, రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి, కలెక్టర్ హాజరయ్యారు. వేణారెడ్డి, కలెక్టర్ ప్రసంగించిన అనంతరం ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మాచ్లాడుతూ..ఈ ప్రాంతానికి కాళేశ్వరం జలాలు వచ్చిన తరువాతనే సస్యశ్యామలమైందని, సన్న బియ్యం పెద్ద ఎత్తున పండుతున్నాయన్నారు.
దీంతో సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు కేసీఆర్ సన్నబియ్యంతో అన్నం పెట్టారని, అలా పండించిన సన్న వడ్లతోనే నేడు రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ జరుగుతుందన్నారు. అంతేకాకుండా కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తుంటే అక్కడకు వచ్చిన కొంతమంది ఓర్వలేని కాంగ్రెసోళ్లు స్లోగన్స్ ప్రారంభించి గలాటా సృష్టించే యత్నం చేయగా, పోటీగా బీఆర్ఎస్ వారు స్లోగన్స్ అందుకోవడంతో కొద్ది సేపు గందరగోళంగా మారింది. దీంతో జగదీశ్‌రెడ్డి కల్పించుకొని బీఆర్ఎస్ వారిని శాంతింపజేసి అనంతరం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు.