సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 2: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలోని నిమ్జ్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని తన చాంబర్లో సోమవారం సాయంత్రం నిమ్జ్ మొదటి దశలో స్వాధీనం చేసుకున్న భూముల గుర్తింపు, ఫెన్సింగ్ పనులు, సమీప రహదారుల అభివృద్ధి, నిమ్జ్‌కు అనుసంధానించే ముఖ్య మార్గాల విస్తరణ వంటి అంశాలపై నిమ్జ్, టీజీఐఐసీ అధికారులు, సర్వే, రెవెన్యూ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిమ్జ్‌లో మౌలిక వసతులు కల్పించే ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇప్పటి వరకు సేకరించిన భూములు అప్పగించాలని సూచించారు. లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు వీలుగా 10 రోజుల్లో సర్వే పూర్తి చేయాలన్నారు.
లే అవుట్ ప్రకారం రోడ్లు, ఇతర మౌలికవసతులు కల్పించేందుకు సేకరించిన భూముల్లో హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలోనే భూములు తీసుకొని రైతులకు నష్టపరిహారం చెల్లించామని, కానీ మొన్నటి వరకు ఆ భూముల్లో పనులు చేపట్టకపోవడంతో పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం అభివృద్ధి పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఇకపై పంటలు వేయకుండా చూడాలన్నారు. ఇప్పటికే పంటలు వేస్తే కోతలు జరిగే వరకు వేచి చూడాలని సూచించారు. సర్వే సందర్శంగా చేసిన హద్దురాళ్లను రైతులు ఎవరూ తొలిగించవద్దని, తొలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ విఠల్, జహీరాబాద్ ఆర్డీవో దేవుజా, నిమ్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశాలాక్షి, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో జగ్గారెడ్డి
నిమ్జ్ మౌలిక వసతుల అభివృద్ధి పనులపై జరిగిన సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పాల్గొనడం విమర్శలకు దారితీసింది. నిమ్జ్ జహీరాబాద్ పరిధిలో ఉన్నందున ఆప్రాంత ఎమ్మెల్యే సమావేశంలో పాలొనాలి. కానీ, ఆ ప్రాంతానికి సంబంధం లేని మాజీ ఎమ్మెల్యే నిమ్జ్ సమావేశంలో పాల్గొనడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, సంగారెడ్డి నియోజకవర్గంలోని మున్సిపాలిటీ పట్టణాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల కోసం కావాల్సిన పాలనాపరమైన అనుమతులు వెంటనే మంజూరు చేయాలని, పట్టణాల్లోని పాఠశాలల వసతి గృహాల్లో పారిశుధ్యం, మరుగుదొడ్ల సమస్యలపై జగ్గారెడ్డి కలెక్టర్‌కు వినతి పత్రం అందించారని అధికారులు వెల్లడించడం గమనార్హం.