మిర్యాలగూడ, సెప్టెంబర్ 01 : కాళేశ్వరంపై వేసిన కమిషన్ రిపోర్ట్ మీద అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రతిపక్షాల గొంతునొక్కి కేటీఆర్, హరీశ్‌రావును మాట్లాడనివ్వక పోవడంపై, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్‌పై లేనిపోని అభాండం మోపి కాళేశ్వరంపై విచారణను సీబీఐకు అప్పజెప్పడాన్ని బీఆర్ఎస్ మిర్యాలగూడ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. మిర్యాలగూడ పట్టణం రెడ్డి కాలనీలో గల పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ తీశారు. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సూచన మేరకు.. మాజీ ఎమ్మెల్యే & మాజీ ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి అధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని రేవంత్ రెడ్డి డౌన్ డౌన్.. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలను మార్మోగించారు.
ఈ సందర్భంగా తిప్పన విజయసింహ రెడ్డి మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల కలను సాకారం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా, రాష్ట్ర అవతరణ అనంతరం 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు కొనియాడారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేసీఆర్‌పై అక్కసు వెళ్లగక్కుతూ, ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయకుండా కాలం వెల్లదీస్తూ.. కాళేశ్వరం మీద లేని పోని పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, ధనావత్ చిట్టిబాబు నాయక్, అన్నబీమోజు నాగార్జున చారి, ఎండి.మోసిన్ అలీ, ఎండి.యూసుఫ్, హతిరాం నాయక్, కుందూరు వీరకోటి రెడ్డి, ధనావత్ బాలాజీ నాయక్, ఎండి.షోయబ్, పద్మశెట్టి కోటేశ్వరరావు, ధీరావత్ రవి నాయక్, కుర్ర శ్రీను నాయక్, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు ఇన్చార్జిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Miryalaguda : ప్రభుత్వ తీరుపై మిర్యాలగూడలో భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు