కోదాడ, ఆగస్టు 30 : మునగాల మండలంలోని తాడువాయి పీఏసీఎస్ ఎదుట రైతులు యూరియా కోసం శనివారం ఆందోళన చేపట్టారు. రెండు రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నప్పటికీ యూరియా సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరాకు బస్తా యూరియా ఇస్తే ఏం చేయాలని అసహనం వ్యక్తం చేశారు. ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు సుంకర అజయ్ కుమార్, తొగరు రమేశ్, కందిబండ సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందస్తు జాగ్రత్త లేకపోవడంతో పాటు నిర్లక్ష్యం వల్లే యూరియా కొరతకు ప్రధాన కారణమన్నారు. ఇప్పటికే మండలంలో సగానికి పైగా పంట పొలాలకు యూరియా చల్లాల్సి ఉందన్నారు.
అయితే సకాలంలో యూరియా అందుబాటులో ఉంచకపోవడం, రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తుందని విమర్శించారు.. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కేసీఆర్ అవసరానికి సరిపడా యూరియా సరఫరా చేసిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమలుకు సాధ్యం కానీ హామీలిచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు చేతకాక చేతులెత్తేశారని విమర్శించారు. ఇప్పటికైనా యూరియాను అందుబాటులో ఉంచకపోతే రైతులతో కలిసి భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నాలో ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు.