యాదగిరిగుట్ట, ఏప్రిల్2 : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి స్వామివారి ప్రసాదాన్ని అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆలేరు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
సాగునీళ్లు లేక పంటలు పూర్తిగా ఎండిపోయాయని, మిషన్ భగీరథ పథకాన్ని నిర్లక్ష్యం చేసి తాగునీళ్లు లేకుండా చేశారని చెప్పారు. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ ఎంతో అద్భుతంగా పునర్నిర్మించారని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కనీస వసతులు కల్పించకపోగా స్వామివారి ఆదాయాన్ని ఇతర అవసరాలకు తరలిస్తున్నారని తెలిపారు. గుట్టలో 10 శాతం పెండింగ్ పనులు కూడా పూర్తి చేయలేకపోతున్నారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చాలా తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని, కేసీఆర్ వస్తేనే మళ్లీ మంచిరోజులు వస్తాయని వివరించారు. జగదీశ్‌రెడ్డిని కలిసిన వారిలో బీఆర్ఎస్ యాదగిరి గుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నార్మూల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, ఆలేరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, బీఆర్ఎస్ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, నాయకులు మిట్ట వెంకటయ్య, గుండ్లపల్లి వెంకటేశ్‌గౌడ్, ఆవుల సాయి, శారాజీ రాజేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు.