సూర్యాపేట, ఫిబ్రవరి 8 : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దండు కట్టి నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారం హోరెత్తిస్తోంది. ఈ సందర్భంగా అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి అమలు చేయలేదని, అభివృద్ధి చేసే బీఆర్ఎస్కు మా ఓటు అంటూ ఓటర్లు కూడా అభ్యర్థులకు హామీ ఇస్తున్నారు. ఆదివారం సూర్యాపేటలోని 44, 46, 14, 22, 23, 37, 41, 42, 31, 36వ వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరగా వారికి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు, ప్రజలకు పేగుబంధంలా ఉన్న కేసీఆర్‌ను దూరం చేసేందుకు 420 అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలవారిని మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యన్నారు. కేసీఆర్ ఇచ్చిన పథకాల్లో కూడా కోతలు పెడుతున్నారే తప్ప, కొత్తవి ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.
రెండు వేల పింఛన్, నాలుగు వేలు చేస్తామన్నారని, మహిళలకు రూ. 2500లు ఇస్తామన్నారని, ఆడ పిల్లలకు స్కూటీలు, విద్యార్థుల ఖాతాల్లో రూ. 5లక్షలు వేస్తామని వేయలేదన్నారు. మొదటి ఏడాదే 2లక్షల ఉద్యోగాలని చెప్పి ఇవ్వలేదని, పదివేలు ఉన్న రైతుబంధును 15వేలకు పెంచుతామని చెప్పి పెంచలేదన్నారు. రైతుబీమా, సన్న ధాన్యం బోనస్ విషయంలో రైతులకు మొండి చేయి చూపించారన్నారు. ఆడపిల్ల పెళ్లికి కేసీఆర్ ఇచ్చిన లక్ష తప్ప.. తులం బంగారం ఇయ్యకనే పాయే అని అన్నారు. కాంగ్రెసోళ్లు ఏం సాధించారని ఓట్లడుగుతున్నారో జనం నిలదీయాలన్నారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకురాలు అనంతుల మల్లీశ్వరి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దంతాల రాంబాబు, పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు మారిపెద్ది శ్రీనివాస్, పుట్ట కిషోర్, మోత్కూరి సందీప్, వార్డు అభ్యర్థులు బిక్కుమళ్ల మంజుల, అంగోతు సంధ్య బావ్‌సింగ్, గాలి సాయికిరణ్, మోత్కూరి దుర్గమ్మ, వల్దాస్ స్పందన, అనంతుల దుర్గా ప్రసాద్, ఢిల్లీ పావని, అంగిరేకుల నాగార్జున, కొండపల్లి సాగర్‌రెడ్డి, రాచకొండ దేవిక పాల్గొన్నారు.