నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో వచ్చిన నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు.
ఉమ్మడి జిల్లా పరిధిలో గురువారం చేపట్టిన రైతు రుణమాఫీ ధర్నాలపై ఆరా తీశారు. ప్రజలు, రైతుల స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలగిరిలో కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్య కాండపైనా చర్చించారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అక్కడ జరిగిన దాడి తాలుకా విషయాలను వివరించినట్లు తెలిసింది.
కేటీఆర్ స్పందిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు చేస్తున్న అరాచకాలను ఎక్కడికక్కడ ఎండ గట్టాలని సూచించారు. పార్టీ నేతలంతా సమన్వయంతో కలిసికట్టుగా పని చేస్తూ కాంగ్రెస్ దాడులను, దౌర్జన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
అంతకుముందు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాల దాడి, పోలీసులు పక్షపాత ధోరణిఫై కేటీఆర్‌తో కలిసి జిల్లా నేతలు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆర్.రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, నోముల భగత్కుమార్లు ఉన్నారు.