నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ): స్థానిక ఎన్నికల ప్రచారం పోటాపోటీగా జరుగుతున్న సమయంలో దేవరకొండలో సీఎం సభ పేరుతో బీఆర్ఎస్ నేతలను,కార్యకర్తలను ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టు చేశారు. రోజంతా పోలీసుస్టేషన్లలోనే ఉంచడం వల్ల శనివారం ఆసాంతం బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని పోలీసులు అడ్డుకున్నైట్లెంది. వాస్తవంగా సీఎం సభను అడ్డుకుంటామని గానీ, ఇతర పిలుపుగానీ ఏమీ లేవు. నల్లగొండ జిల్లా అంతటా అన్ని పార్టీలు సర్పంచ్ ఎన్నికల బిజీలో ముగినిపోయాయి. ఈ తరుణంలో శనివారం దేవరకొండలో ప్రజాపాలన విజయోత్సవ సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. సీఎం వస్తున్నాడన్న పేరుతో తెల్లవారుజాము నుంచే పోలీసులు బీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.
దేవరకొండ నియోజకవర్గమంటే ఏదో అనుకోవచ్చు.. గానీ జిల్లా అంతటా ఇదే తరహాలో అరెస్టుల పర్వం కొనసాగింది. దేవరకొండ నుంచి మొదలుకుని నకిరేకల్ వరకు, ఎంజీ యూనివర్సిటీ నుంచి మిర్యాలగూడ వరకు ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో కీలక నేతలందర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేతలందర్నీ పీఎస్‌ల నుంచి బయటకు కదలనివ్వలేదు. తాము సీఎం సభ వైపు వెళ్తామనిగానీ, అడ్డుకుంటామనిగానీ తమ పార్టీ పిలుపునివ్వలేదని వివరించినా పోలీసులు వినిపించుకోలేదు. సాయంత్రం వరకు ఆయా పీఎస్‌ల పరిధిలోనే పార్టీ నేతలు పోలీసుల అదుపులోనే ఉన్నారు. దీంతో శనివారం పలుచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారానికి తీవ్ర ఆటంకం కలిగిందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రచారానికి ఉన్న సమయమే అతి తక్కువ కావడం…అందులో ఒక రోజంటే చాలా విలువైన సమయమని పార్టీ నేతలు చెప్తున్నారు. పోలీసుల ముందుస్తు అరెస్టులు పరోక్షంగా అధికార పార్టీకి తోడ్పాటునందించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మర్రిగూడెం మండలంలో వ్యక్తిగత పని మీద వెళ్తున్న నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని సైతం చండూరులో పోలీసులు అడ్డుకున్నారు. సీఎం సభా రూట్‌కు ఏ మాత్రం సంబంధం లేకున్నా పోలీసులు ఆయనను విడిచిపెట్టలేదు. పోలీసుల తీరుపై భూపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు. చాలా సమయం భూపాల్‌రెడ్డి ముందుకు కదలకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అభ్యర్థుల తరఫున పాల్గొనాల్సిన ప్రచారం సభలకు హాజరుకాలేకపోయారు. జిల్లా అంతటా స్థానిక ఎన్నికల వేళ పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్థానిక ఎన్నికల వేళ దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల కోడ్ వర్తించదంటూ సీఎం సభ నిర్వహించారు. అయితే ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం కోడ్ ఉల్లంఘిస్తూ సాగడం చర్చనీయాంశమైంది. ఇందిరమ్మ చీరలు ప్రతి ఒక్కరికీ అందిస్తున్నామని సీఎం వివరించారు. ఇందిరమ్మ చీరలు కట్టుకొని వెళ్లి సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు వేయాలంటూ పిలుపునిచ్చారు. దీంతో పాటు మంత్రినో, ఎమ్మెల్యేనో కలిసి అభివృద్ధి పథకాలు తెచ్చే అభ్యర్థులకే ఓటు వేయాలంటూ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఏకంగా ఎన్నికల ప్రచార ప్రసంగాన్ని తలిపించారన్న చర్చ వినిపించింది. ఇక బాలూనాయక్ సైతం సీఎంకు అభివృద్ధి పనుల మంజూరు కోసం విన్నవిస్తూ నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ ప్ర స్తావించారు.
తండాలు, గ్రామాల్లోని రోడ్లు, తాగునీరు, ఎత్తిపోతల పథకాలు ఇలా 20కిపైగా పథకాల కోసం నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇది కూడా ఎన్నికల ఉల్లంఘనలోకి వస్తుందన్న విమర్శలు వినిపించాయి. త్వరలోనే పలువురు మంత్రులు దేవరకొండకు వచ్చి అభివృద్ధిపై చర్చిస్తారంటూ సీఎం చెప్పడం కూడా ఉల్లంఘనే అవుతుందన్న చర్చ జరిగింది. సీఎం స్థాయిలోనే ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడితే ఎలా అని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.
దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో కేవలం రూ.20 కోట్ల నిధులకు సంబంధించిన పనులకే శంకుస్థాపనలు జరగడం విస్మయానికి గురి చేస్తోంది. సీఎం వచ్చి ప్రారంభిస్తున్నారంటే వందల కోట్ల నిధులతో పథకాలు ఉన్నాయని భావిస్తుంటారు. ఇక్కడ కేవలం రూ.20 కోట్లతోనే పనులకు శ్రీకారం చుట్టడం… దానికి సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు జరపడం గమనార్హం. అధికారులు వెల్లడించిన వివరాలు ప్రకారం.. రూ.13 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం, రూ.2.50 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రూ.50 లక్షలతో సీసీ డ్రైన్లు, రూ.2 కోట్లతో జూనియర్ కాలేజీ అభివృద్ధి పనులు, రూ.2 కోట్లతో బీఎన్ఆర్ పార్క్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.
దేవరకొండ అభివృద్ధి కోసం.. రెండేండ్లుగా సీఎం రాక కోసం ఎదురు చూస్తున్నానని ఓ వైపు ఎమ్మెల్యే బాలూనాయక్ ప్రకటించగా, అంతకుముందు రూ.20 కోట్ల పనులకు మాత్రమే సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ లెక్కన బాలూనాయక్ సీఎంను కోరిన వరాలు కార్యరూపం దాల్చాలంటే ఎన్నేండ్ల సమయం కావాలోనన్న చలోక్తులు సభా ప్రాంగణంలో వినిపించడం గమనార్హం.