చివ్వెంల,సెప్టెంబర్ 7 : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని దురాజ్‌పల్లి 5వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ బాషాను ఓ దాడి కేసులో చివ్వెంల ఎస్సై మహేశ్వర్ శనివారం అర్ధరాత్రి అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం 5వ వార్డు (దురాజ్‌పల్లి)కు చెందిన షేక్ మునీర్, తనపై మాజీ కౌన్సిలర్ బాషా దాడి చేశాడంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బాషాను అరెస్టు చేసినట్లు తెలిపారు.
దాడిలో తన ఎడమ చెయ్యి, ఛాతికింది భాగంలో గాయాలైనట్లు మునీర్ మెడికల్ సర్టిఫికెట్ తేవడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కేసు విచారణలో భాగంగా దురాజ్‌పల్లి వెళ్లి అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించగా మునీర్ వెనుక బాషా పరుగెత్తుతున్న దృశ్యం సీసీ పుటేజీలో తేలిందన్నారు. సంఘటనా స్థలంలో ఎటువంటి మారణాయుధాలు లభించలేదన్నారు. మరికొన్ని సీసీ పుటేజీలను పరిశీలించి తదుపరి విచారణ చేపట్టనున్నట్లు సీఐ తెలిపారు. కేసు విచారణలో భాగంగా తమకు బాషా సహకరించాలని సూచించినట్లు తెలిపారు.
పోలీస్టేషన్ ముట్టడితో బాషా విడుదల..
బాషాను అక్రమంగా అరెస్టు చేయడంతో 5వ వార్డు ప్రజలు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పోలీస్టేషన్‌కు వచ్చి తమ నాయకుడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చివ్వెంల పోలీస్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందని భావించిన పోలీసులు వెంటనే బాషాను విడుదల చేశారు.
అక్రమ అరెస్టులు సరికాదు..
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాషాను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఆదివారం ఆయన చివ్వెంల పోలీస్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అక్రమంగా అరెస్టు చేయడం సరి కాదన్నారు. వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తమ కార్యకర్తలను, నేతలను అరెస్టు చేస్తే ఏం జరుగుతుందో కాంగ్రెస్ నాయకులకు తెలిసివచ్చిందన్నారు.