సూర్యాపేట, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఆస్మా తుఫాన్ కారణంగా జరిగిన వరద విలయానికి సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలు ఎక్కువ దెబ్బతిన్నాయి. పంటలు నేలమట్టమైన రైతులు, సర్వం కోల్పోయిన ప్రజలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఆదివారం తమ నియోకవర్గాలకు రాని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెండోరోజు సోమవారం వచ్చారు.
కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ మాత్రం రెండ్రోజుల నుంచి వరద ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులకు ధైర్యం చెప్తున్నారు. ప్రభుత్వం తరపున సాయం అందే వదిలే ప్రసక్తే లేదని భరోసా కల్పిస్తున్నారు. కోదాడ, హుజూర్నగర్ పట్టణాల్లోని 70 శాతం ప్రాంతాల్లోని ఇండ్లను వరద నీరు ముంచెత్తింది. నిత్యావసర సరుకులన్నీ నీటి పాలయ్యాయి. తినడానికి తిండి కూడా లేకుండాపోయిందని నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురంలో బాధితులు స్థానిక ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు. చాలాచోట్ల ఇదే పరిస్థితి. అధికారులు ఎవరు వెళ్లినా చేతులు జోడించి వేడుకుంటున్నారు. జిల్లాలో 21 చెరువులతోపాటు నాగార్జునసాగర్, మూసీ కాల్వలు తెగడంతో వేల ఎకరాల్లో ఇసుక, మట్టి మేటలు కనిపిస్తున్నాయి. 44 ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. 7 ఇండ్లు పూర్తిగా కూలాయి. కోదాడలో వరద తాకిడికి ఇద్దరు చనిపోయారు. 7 పశువులు మృత్యువాతపడ్డాయి. 750 విద్యుత్ స్తంభాలు, 150 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.
నల్లగొండ జిల్లాలో 27 మండలాల్లో కురిసిన వాన
నీలగిరి : నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అదివారం ఉదయం 8 నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు జిల్లాలో 6.6 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. నార్కట్‌పల్లిలో 29.9, మిల్లీమీటర్లు, కట్టంగూర్‌లో 19.9, శాలిగౌరారంలో 18.4, చిట్యాలలో 16.9, మునుగోడులో 16.3, మాడ్గులపల్లిలో 15.1, వేములపల్లిలో 14.8, చండూరులో 13.6, నల్లగొండలో 13.2, నకిరేకల్‌లో 12.1, కేతేపల్లిలో 8.5, తిప్పర్తిలో 8.1, గుండ్లపల్లిలో 6.2, కనగల్‌లో 5.5, మర్రిగూడలో 3.0, దేవరకొండలో 1.6, నాంపల్లిలో 1.5, మిర్యాలగూడలో 1.2, చింతపల్లిలో 0.9, త్రిపురారంలో 0.8, గట్టుప్పల్‌లో 0.8, చందంపేటలో 0.7, గుర్రంపోడ్లో 0.6, దామరచర్లలో 0.5, నేరేడుగొమ్ములో 0.5, కొండమల్లేపల్లిలో 0.3, అనుములో 0.1 వర్షపాతం నమోదైంది.