సూర్యాపేట, జూలై 14 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించలేక చతికిలపడిన రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్..కొత్తగా ఎటువంటి అభివృద్ధి చేయలేక కర్కశత్వంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తామని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎలాంటి పిలు పు ఇవ్వకున్నా ప్రభుత్వం అత్యంత పాశవికంగా నిర్బం ధకాండను కొనసాగిస్తోంది.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చి అరకొరగా కూడా ఆ పథకాలను అమలు చేయలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభు త్వం హుజూర్‌నగర్‌లో రేషన్ బియ్యం పథకాన్ని ప్రారంభించినప్పుడు, నేడు తిరుమలగిరిలో రేషన్ కార్డుల పం పిణీని ప్రారంభించినప్పుడూ నిర్బంధకాండను అమలు చేస్తోంది. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తారేమోననే భయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ నిర్బంధించి రోజంతా పోలీస్ స్టేషన్లలో ఉంచారు.
తాజాగా తిరుమలగిరిలో నిర్వహిం చే సభకు సీఎం రావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో, గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులను పెద్ద ఎత్తున ముందస్తుగా అరెస్టులు, గృహనిర్బంధం చేశారు. గతంలో హుజూర్నగర్ సభకు ముందురోజు అర్థరాత్రి నుంచి అరెస్టుల పర్వం కొనసాగగా, తిరుమలగిరిలో మాత్రం సోమవారం మీటింగ్ ఉంటే ఆదివారం మధ్యాహ్నం నుంచే అరెస్టు చేసి, నేతలను, కార్యకర్తలను నానా ఇబ్బందులకు గురి చేశారు. సీఎం తిరుమలగిరికి వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో వచ్చిన సాగునీరు ఇప్పుడెందుకు రావట్లేదో చెప్పాలని ప్రశ్నించిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ను హైదరాబాద్‌లోని నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
సూర్యాపేట జిల్లా కేం ద్రంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ పుట్ట కిశోర్, యువజన నాయకులు ముదిరెడ్డి అనిల్‌రెడ్డి, మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్‌తో పాటు పలువు రు మాజీ కౌన్సిలర్లు, నాయకులను అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సాయంత్రం వరకు ఉం చారు. తుంగతుర్తి నియోజకవర్గంలో అర్థరాత్రి ప్రాం తంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు.
చివ్వెంల, ఆత్మకూర్.ఎస్‌లో బీఆర్ఎస్, పీవైఎల్ నాయకులు, కోదాడ, అర్వపల్లిలో బీఆర్ఎస్, పీడీఎస్‌యూ నాయకులను, నాగారంలో బీఆర్ఎస్ శ్రేణులను పెద్ద సంఖ్యలో అరెస్టు చేశారు. తిరుమలగిరిలో బీఆర్ఎస్, టీఆర్ఎస్వీ, హుజూర్నగర్ మండలంలో బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి సాయం త్రం వరకు అదుపులో ఉంచారు. నల్లగొండ జిల్లా కేం ద్రంతోపాటు శాలిగౌరారం మండల కేంద్రం, వల్లాల గ్రామం, నిడమనూరు తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు.
మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ హౌస్ అరెస్ట్
తిరుమలగిరి, జూలై 14 : సీఎం రేవంత్‌రెడ్డి తుంగతుర్తి పర్యటన నేపథ్యంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ను సోమవారం హైదరాబాద్‌లో హౌస్ అరెస్టు చేశారు. పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టి నిర్బంధించడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిది ప్రజా పాలన కాదని.. గాలిపాలన అని, పాలనను గాలికి వదిలి అరెస్టుల పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు.
అర్థరాత్రి నుంచే బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టులు చేయడం రాక్షస పాలనకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, హామీలను అమలు చేసే సత్తా లేక ప్రశ్నించేవారిని అరెస్టులు చేయిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ పార్టీ, నాయకులు భయపడరన్నారు. పోలీసుల బలం ఉపయోగించి ప్రతిపక్షాలను అణచివేయాలని చూడడం అప్రజాస్వామికం, అనైతికం అన్నారు.