ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ప్రభుత్వ విధానాలు, అధికార పార్టీ నేతల ఆగడాలపై ప్రశ్నించినా, నిలదీసినా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి చండూరులో బీఆర్ఎస్ నేత, మాజీ కౌన్సిలర్ అన్నెపర్తి శేఖర్ అరెస్టు అందుకు తాజా ఉదాహరణగా నిలుస్తున్నది. ఆర్ధిక లావాదేవీలో ఓ వ్యక్తితో చోటుచేసుకున్న వివాదాన్ని అవకాశంగా చేసుకుని అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు వ్యవహారించిన తీరు తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి మఫ్టీలో వచ్చి తామెవరో చెప్పుకుండా తలుపులు తోసుకుంటూ వెళ్లి శేఖర్‌ను నిర్బంధించి బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయారు. అంత రాత్రిపూట ఎందుకు పట్టుకుపోతున్నారో, ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పకపోవడంతో శేఖర్ కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరో కిడ్నాప్ చేశారని భయపడి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు నిద్రలేచి వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శేఖర్ ఇంటికి పెద్దసంఖ్యలో చేరుకుని ఆందోళనకు దిగారు. దాంతో శుక్రవారం ఉదయం 9 గంటల తర్వాత తామే ఆర్ధిక లావాదేవీల వివాదంలో శేఖర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించక తప్పలేదు.
– నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 14
(నమస్తే తెలంగాణ)/చండూరు : చండూరుకు చెందిన అన్నెపర్తి శేఖర్ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల నేతగా ఉన్నారు. మాజీ జడ్పీటీసీ సభ్యుడిగా, మాజీ కౌన్సిలర్‌గా పని చేస్తూ నిత్యం ప్రభుత్వ విధానాలు, అధికార కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహార శైలిని ఎండగడుతున్నారు. దాంతో కొన్ని నెలలుగా అధికార పార్టీ నేతలు పలు రకాలుగా శేఖర్‌ను పరోక్షంగా వేధింపులకు గురిచేస్తున్నారు. పోలీసుల ద్వారానూ ఒత్తిడి చేశారు. అయినా శేఖర్ వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు దిగినట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా చండూరుకు చెందిన చిట్టిప్రోలు మహేశ్ అనే వ్యక్తితో శేఖర్‌కు జరిగిన ఆర్ధిక లావాదేవీల పంచాయితీని అడ్డం పెట్టుకుని అక్రమంగా అరెస్టు చేయించారని మండిపడుతున్నారు. అర్ధరాత్రి వచ్చి వివరాలేవీ చెప్పకుండా అరెస్టు చేసిన తీరుపై శేఖర్ కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
చండూరులోని కాస్తాల క్రాస్ రోడ్డులోని అన్నెపర్తి శేఖర్ ఇంటికి రాత్రి 3.30గంటల సమయంలో నలుగురు మఫ్టీలో ఉన్న వ్యక్తులు ప్రత్యేక వాహనంలో వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వాళ్లు తెలిపిన వివరాల ప్రకారం… రాత్రి ఇంటి తలుపు తట్టడంతో ఎవరని ప్రశ్నిస్తే… డోర్ తీయండి.. శేఖర్‌తో మాట్లాడాలంటూ బలవంతంగా తలుపులు తెరిపించారు. తర్వాత శేఖర్‌ను పట్టుకుని బయటకు తీసుకెళ్తుంటే ఎందుకు పట్టుకుపోతున్నారని ప్రశ్నించినా సమాధానం చెప్పకుండా దౌర్జన్యంగా వ్యవహరించారు. వాహనం ఎక్కిస్తుండగా వచ్చిన వ్యక్తులను నిలదీయగా తాము పోలీసులమని చెప్తూ వెళ్లిపోయారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదు. దాంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు స్థానిక బీఆర్ఎస్ నాయకులకు సమాచారం ఇచ్చారు. దాంతో వారంతా శేఖర్ ఇంటికి చేరుకుని ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి శేఖర్ ఆచూకీ కోసం నిలదీశారు. ముందు తమకు ఏమీ తెలియదంటూ స్థానిక పోలీసులు చెప్పి తప్పించుకోవాలని చూశారు. అప్పటికే శేఖర్‌ను చండూరు నుంచి నల్లగొండలోని రహస్య ప్రాంతానికి తరలించారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. దాంతో వాళ్లు రంగంలోకి దిగి శేఖర్ ఆచూకీ కోసం పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల హుటాహుటిన నల్లగొండకు చేరుకున్నారు. ఈలోపు ఉదయం 9గంటల సమయంలో శేఖర్ తమ అదుపులోనే ఉన్నట్లు పోలీసులు వెల్లడించక తప్పలేదు. కానీ, శేఖర్ ఎక్కడ ఉన్నారో మాత్రం అప్పటికీ చెప్పలేదు.
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎస్పీ కార్యాలయానికి చేరుకుని.. బంగ్లాలో ఉన్న ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ను కలిశారు. శేఖర్ కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళనను వివరిస్తూ ఆచూకీ తెలుపాలని కోరారు. దాంతో నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ కోసం ఉంచినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి ప్రభాకర్‌రెడ్డి నేరుగా బీఆర్ఎస్ నేతలతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. శేఖర్‌తో మాట్లాడి జరిగిన ఘటనపై ఆరా తీసి ధైర్యం చెప్పారు. అక్రమ కేసులతో తమ గొంతు నొక్కలేరని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మీడియాతో మాట్లాడుతూ కూసుకుంట్ల హెచ్చరించారు. మధ్యాహ్నం తర్వాత చండూరు పోలీసులు శేఖర్‌ను కోర్టులో హాజరు పరిచారు.
‘అర్ధరాత్రి మా ఇంటికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మమ్మల్ని నిద్ర లేపి మా ఆయన శేఖర్‌ను ఎత్తుకుపోయారు. ఎవరు మీరు? ఇంత రాత్రి ఎందుకు వచ్చారని ఎన్ని సార్లు అడిగినా చెప్పలేదు. తలుపులు తోసుకుంటూ లోపలికి వచ్చారు. ఎంత చెప్పినా వినకుండా మమ్మల్ని నెట్టేసి మా ఆయన్ని లాకొన్ని వెళ్లి వాహనంలో ఎక్కించారు. అప్పుడు గట్టిగా నిలదీస్తే మేం పోలీసులం అంటూ వెళ్లిపోయారు. ఇంత రాత్రిపూట వివరాలు చెప్పకుండా ఎలా పట్టుకుపోతున్నారు? నా భర్త అక్రమ అరెస్ట్‌పై హైకోర్టుకు వెళ్తాను. తన భర్తకు ఎలాంటి హాని జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నా భర్తను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.’
-సంతోష, శేఖర్ భార్య
‘అన్నెపర్తి శేఖర్‌పై అక్రమ కేసులతో కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఇలాంటి కేసులకు భయపడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానం. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్న శేఖర్ అరెస్టు చేయడం అధికార పార్టీ నేతల కుట్రలో భాగమే. ఓ వ్యక్తితో ఉన్న డబ్బుల పంచాయితీ అయితే అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటి? కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ, కార్యకర్తలను బెదిరించేలా పోలీసులు వ్యవహరించడం తగదు. శేఖర్‌ను తక్షణమే విడుదల చేయాలి.’
-బొమ్మరబోయిన వెంకన్న, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు
ఇంత హైడ్రామా క్రియేట్ చేస్తూ అర్ధరాత్రి అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం సాయంత్రం వాట్సాప్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన చూసినవాళ్లు ఇంత దానికి అర్ధరాత్రి అరెస్టు, హైడ్రామా క్రియేట్ చేయడం అవసరమా అని ఆశ్చర్యం వ్యక్తం చేయడం కనిపించింది. ‘చండూరు గ్రామానికి చెందిన చిట్టిప్రోలు మహేశ్ అనే వ్యక్తితో అదే గ్రామానికి చెందిన అన్నెపర్తి శేఖర్ అనే వ్యక్తి డబ్బుల విషయంలో అకారణంగా గొడవ పడి కొట్టి, బూతులు తిట్టి, బెదిరించాడు. దాంతో మహేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడైన అన్నెపర్తి శేఖర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడమైంది’ అంటూ పోలీసుల ప్రకటనలో పేర్కొన్నారు.