అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తూ సీఎం కేసీఆర్ జనరంజక పాలన సాగిస్తున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు(ఎం) మండలం కూరెళ్లలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీకి విజన్ లేదు, సంకల్పం లేదని విమర్శించారు. ఆబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో దేశం కోసం బయల్దేరిన సీఎం కేసీఆర్‌పై బీజేపీ కక్షగట్టి, అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రధాని మోదీకి అదానీ, అంబానీపై ఉన్న ప్రేమ పేదలపై లేదన్నారు. అపర భగీరథుడిగా మారి బీడు భూములకు సాగు జలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. నేడు ఏ గ్రామం చూసినా చెరువుల నిండా నీళ్లు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, పార్కులు, అద్దంలా రోడ్లు, పచ్చని పొలాలు, గలీగల్లీకి సీసీ రోడ్లు దర్శనమిస్తున్నాయని చెప్పారు. సంపదను పెంచి ప్రజలకు పంచాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని చెప్పారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని, ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఆత్మకూరు(ఎం), ఏప్రిల్ 3 : దేశ ప్రజలు గొప్పగా చెప్పుకొనేలా ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన సాగిస్తున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి పాలనను చూసి ఓర్వలేకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బరితెగింపు దాడులకు పాల్పడుతున్నదని విమర్శించారు. మండలంలోని కూరెళ్ల గ్రామంలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలివి, విజన్, సంకల్పం ఏదీ లేదన్నారు. ఆబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశం కోసం బయల్దేరిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పైన కేంద్ర ప్రభుత్వం బరితెగింపు దాడులు చేస్తూ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదోళ్ల నడ్డి విరుస్తున్నారన్నారు. ప్రధాని మోదీకి అదానీ, అంబానీలపై ఉన్న ప్రేమ పేదలపై లేదని విమర్శించారు. అపర భగీరథుడు సీఎం కేసీఆర్ దీక్షాదక్షతతో తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. ఏ గ్రామం చూసినా చెరువుల నిండా నీళ్లు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డు, పార్కులు, అద్దంలా రోడ్లు, పచ్చని పొలాలు, వీధుల్లో సీసీ రోడ్లు దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. సంపదను పెంచి ప్రజలకు పంచాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని తెలిపారు. మారుమూల గ్రామాల్లో సైతం కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందన్నారు. త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన ప్రతి దళితుడికీ దళిత బంధు పథకం అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ర్టాన్ని ఇచ్చింది తామేనని చెప్పుకోవడానికి కాంగ్రెసోళ్లకు బుద్ధి ఉండాలని, 2009లో తెలంగాణ ఇచ్చి ఉంటే ఇంత మంది విద్యార్థులు, యువకులు బలిదానం చేసుకునేవారా? అని ప్రశ్నించారు. గ్రామాల్లోకి వచ్చే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల కల్లబొల్లి మాటలను నమ్మొద్దన్నారు. రూపాయి సాయం చేసిన వారు గొప్పలు చెప్పుకొంటున్నారని, ఇంత చేసిన మనం ఇంటింటికీ వెళ్లి ముమ్మర ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ పనికిమాలిన పార్టీలు చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు.
ఆత్మకూరు(ఎం) ప్రాంతానికి సాగునీరు అందించేందుకు బునాదిగాని కాల్వకు నృసింహసాగర్ ప్రధాన కాల్వను అనుసంధానం చేశామని ప్రభుత్వ విప్ అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్ర వేశారని, తమ సొంత నిధులతో 19.5 కిలోమీటర్ల మేర కాల్వ పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. మరో మూడు నెలల్లో ఆత్మకూరు(ఎం) మండలానికి గోదావరి జలాలు తీసుకొస్తామన్నారు. ఈ కాల్వ ద్వారా 25వేల ఎకరాలకు సాగు జలాలు అందుతాయని చెప్పారు. రాయగిరి – మోత్కూరు ప్రధాన రహదారి పనులు తుది దశకు చేరుకున్నాయని, కాటేపల్లి కాజ్వే నిర్మాణం పూర్తయిందని, అక్కడి నుంచి బీటీ రోడ్డు వేసి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.
బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి
ప్రభుత్వ సంక్షే పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లి బీర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేద్దామని పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఒంటేరు యాదవరెడ్డి అన్నారు. వారం రోజులుగా జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉన్నదని, రెట్టించిన ఉత్సాహంతో పార్టీ శ్రేణులు పాల్గొంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ మూడోసారి గెలుపు దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన సాగిస్తున్నారని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. ఇంటింటికీ పథకాలు అందుతున్నాయని, గ్రామాల్లో అభివృద్ధిని చూసి ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఆశ్యర్యపోతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో స్థానిక సంస్థల ప్రజాప్రతిధులు గౌరవంగా ఉన్నారని, సర్పంచుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిస్తున్నదని అన్నారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
ఒకప్పుడు ప్రభుత్వ పథకం అందాలంటే ప్రజలు తంటాలు పడేవారని, ఒక గ్రామానికి విద్యుత్ అందించాలంటే ఎన్నో పైరవీలు చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు పైరవీలు లేకుండానే ప్రభుత్వ ఫలాలు పారదర్శకంగా అందుతున్నాయని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితులకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేసి ఆర్థికంగా బలోపేతం చేశారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. బీజేపీకి మింగుడు పడక కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. దేశంలో దుర్మార్గమైన పాలన సాగిస్తున్న బీజేపీని ఎన్నికల్లో బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో ఆశించిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. కొట్లాడి సాధించిన తెలంగాణ అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బీఆర్ఎస్ను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి
చేయాలన్నారు.
8 గ్రామాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళం సంబురంగా సాగింది. కార్యక్రమంలో రాఘవాపురం, దుప్పల్లి, లింగరాజుపల్లి, పల్లెర్ల, పుల్లాయిగూడెం, తుక్కాపురం, నర్సాపురం గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తమ గ్రామంలో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని ప్రతిన బూనారు.
పార్టీ మండలాధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కూరెళ్ల సర్పంచ్, క్లస్టర్ కన్వీనర్ బాషబోయిన ఉప్పలయ్య, డీఎల్‌డీఏ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ మోతె సోమిరెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి, నాయకులు మేడి రామనర్సయ్య, కోరె భిక్షపతి, బీసు ధనలక్ష్మి, దశరథగౌడ్, వెంకటేశ్, కవిత, అరుణ, రమేశ్, స్వామి, అశోక్, ప్రవీణ్‌రెడ్డి, శంతన్రాజు, సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.